ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. వైసీపీకి..టీడీపీకి పెద్దగా తేడా ఏమీ లేకుండా పోతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఎక్కువ మందిలో. ఒకప్పుడు టీడీపీ అంటే మధ్యతరగతి ప్రజలతో పాటు విద్యావంతుల్లో చాలా మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తోంది. పాలనలో...అవినీతి విషయంలోనే కాదు...రాజకీయం విషయంలో కూడా రెండు పార్టీల మధ్య పెద్దగా వ్యతాసం ఏమీ లేదు అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసి ఎక్కువ సీట్లు దక్కించుకుంది. టీడీపీ అయితే అప్పుడు ఏకంగా హాండ్స్ అప్ అని ఎన్నికలనే బాయ్ కాట్ చేసింది. అయినా కొంత మంది బరి లో నిలిచారు. అధికారం ఉంది కదా అని వైసీపీ అప్పటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు పలు కీలక స్థానాలను టార్గెట్ చేసుకుని రాజకీయం చేసింది. ఈ ఫలితాల ఆధారంగా టీడీపీ రాజకీయంగా బలహీనపడింది అనే చెప్పే ప్రయత్నం చేసింది. కానీ 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయో అందరూ చూశారు.

                                       గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన దానికంటే ఇప్పుడు కూటమి సర్కారు ముఖ్యంగా టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా వైసీపీ అప్పుడు కుప్పం ను టార్గెట్ చేసినందుకు కౌంటర్ గా అన్నట్లు ఇప్పుడు టీడీపీ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపతో పాటు సొంత నియోజకవర్గం పులివెందుల తో పాటు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలా స్పెషల్ ఫోకస్ పెట్టి రాజకీయం చేస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ ఎలా చేసిందో అలాగే చేసి...రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. చివరకు వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చేసిన కామెంట్స్ కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చలాంటివే అని చెప్పొచ్చు. వైసీపీ అంతా పక్కాగా..పద్దతిగా చేసింది...చేస్తుంది అని ఎవరూ చెప్పరు. కాకపోతే అత్యంత శక్తివంతంగా ఉన్న కూటమి అన్ని రకాలుగా అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నా కూడా వైసీపీ నేతలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నారు. అప్పుడు టీడీపీ ఎన్నికల నుంచి పూర్తిగా జారుకుంటే..ఇప్పుడు వైసీపీ నిలబడి పోరాడే ప్రయత్నం చేస్తోంది. 

                                     మరో కీలక విషయం ఏమిటి అంటే వైసీపీ హయాంలో కొంత మంది ఆ పార్టీ నాయకులు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు...క్యాడర్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోమని కొంత మంది టీడీపీ నేతలు పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని కోరినా కూడా మనం అధికారంలోకి వచ్చింది కక్షలు తీర్చుకోవటానికి కాదు...మీ రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తారా అంటూ ఈ విషయాలను ప్రస్తావించిన నేతలను క్లాస్ తీసుకున్నట్లు టీడీపీ నేతలు చెపుతున్నారు. ఇదే అదనుగా ఇప్పుడు ఎన్నికల సమయంలో అధికారంలో లేకపోయినా సరే స్థానికంగా వైసీపీ నేతలు గట్టిగా నిలబడి సవాల్ చేయటానికి ఇది కూడా ఒక కారణం అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. పలు నియోజకవర్గాల్లో కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు..స్థానిక వైసీపీ నేతలతో..మాజీ ఎమ్మెల్యేలతో రాజీ పడ్డారు అనే చర్చ కూడా టీడీపీ నేతల్లో ఉంది. పై స్థాయిలో జరిగినట్లే జిల్లా స్థాయిలో కూడా కొంత మంది నేతలు వ్యవహరించారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు చూసిన తర్వాత ఏపీ రాజకీయాలు ఏ మాత్రం మారేలా లేవు అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది.

Tags: