Full Viewఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తెలిసిన వాళ్లందరికీ పీఆర్ పీ పేరు బాగా తెలుసు. దీనికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం (పీఆర్ పీ) పేరుతో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఇది అంతా నడిచింది. అయితే ఎక్కువ రోజులు రాజకీయం చేయలేకపోయిన చిరంజీవి తన పార్టీ పీఆర్ పీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్య సభ సభ్యుడి అయి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందు ప్రకటించినట్లుగానే నవంబర్ 11 న తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో. చిరంజీవి విలీనం చేసిన పీ ఆర్ పీ పేరు గుర్తుకు వచ్చేలా ఆయన తన పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్ పీ)గా నామకరణం చేశారు. ఈ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన కొత్త పార్టీ పేరు ప్రజల్లోకి త్వరగా వెళ్ళటం కోసమే విజయసాయి రెడ్డి ఈ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. పార్టీ పేరు ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం తో పాటు తెలుపు, కాషాయ రంగులో జెండాను రూపొందించారు.

                                                పార్టీ ప్రకటన తర్వాత మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు అన్నది ప్రజలే తీసుకురావాలని అన్నారు. ఏపీ భవిష్యత్తు ఏ నాయకుడి చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండు తప్పు చేస్తున్నాయని తెలిపారు. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు కుటుంబాలే శాసించాలా.. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల నుంచే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా అని ప్రశ్నించారు. తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలా అని అడిగారు. ప్రతి కులంలో నాయకులు ఉంటారు.. పుడతారని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతనే సీఎంగా చేయాలనేది తమ పార్టీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తుఫాన్ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల అరాచక పాలనపై విస్ఫోటనం ఎలా ఉంటుందో భవిష్యత్తులో ప్రజలే చూస్తారని అన్నారు.

                                            దుష్ట పరిపాలనకు ఈ సందర్భంగా తాను సవాల్ విసురుతున్నానని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.ఓటు వేయడంతోనే ప్రజల బాధ్యత ముగిసిపోదని, అక్కడి నుంచే ప్రజాస్వామ్యంలో వారి అసలైన పాత్ర ప్రారంభమవుతుందని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినా నిలదీసి ప్రశ్నించాలని అన్నారు. అది తానైనా, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. 'పరివర్తన రాజనీతి పార్టీ' ద్వారా మరొక నాయకుడిని ఇవ్వడానికి తాను రాలేదని, యువతలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి వారిని నాయకులుగా మార్చడానికే వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో అహంకారపూరితమైన రెండు కుటుంబాల నాయకత్వానికి స్వస్తి పలకాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగుతుంది అని..యువతకే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు.

Tags: