గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. స్వయంగా వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. కాకపోతే అవేమి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించలేకపోయాయి. జనసేన పోటీ చేసిన 21 సీట్లలో గెలిచి దేశంలోనే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ గా రికార్డు నమోదు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సారి విడాకుల ప్రకటన చేశారు. అంటే తన మూడవ భార్యకు కూడా విడాకులు ఇస్తున్నట్లు సోమవారం రాత్రి అధికారికంగా వెల్లడించారు. ఇది ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడవ భార్యకు విడాకులు ఇస్తూ ప్రకటన చేయటం కూటమికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి తప్పదు అనే చర్చ సాగుతోంది.

                               మరో వైపు పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి చెపుతూ పదే పదే ప్రకటనలు చేశారు. దీంతో ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇలాగే చేస్తారా అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విడాకులకు సంబదించిన అంశంపై పవన్ కళ్యాణ్ ప్రకటన సారాంశం ఇలా ఉంది. 'మా జీవితంలో ముఖ్యమైన భాగాన్ని కలిసి గడిపాం. ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినప్పటికీ.. మంచి స్నేహితులుగా, మా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ మా ఉమ్మడి ప్రాధాన్యాల్లో భాగంగా ఉంటుంది. మా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పు ఇది. దీనిని అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు' అని ఆ ప్రకటనలో తెలిపారు. రష్యాకు చెందిన అన్నా లెజినోవా ను పవన్ కళ్యాణ్ 2013 లో పెళ్లి చేసుకున్నారు.

Tags: