అందులో అధికారులకు భారీగా వాటాలు!
జిల్లా ఏదైనా సరే ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం అంటే చాలు కాంట్రాక్టు ఆ కంపెనీకే ఇవ్వాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక ఐఏఎస్ అధికారి నుంచి అనధికారికంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్లు చెపుతున్నారు. సీఎంఓ అధికారి తో పాటు ఈ మొత్తం వ్యవహారం లో ప్రోటోకాల్ విభాగానికి చెందిన మరొక అధికారి కూడా కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధికారిక కార్యక్రమాలే కాకుండా ఇతర కీలక నేతల కార్యక్రమాల విషయంలో కూడా అంతా ఆ సంస్థ చూసుకోవాల్సిందే. అదే సజ్జన్ మాన్ కు చెందిన మాన్ డెకరేటర్స్. రాష్ట్రానికి ప్రధాని...రాష్ట్రపతి వంటి వివిఐపీలు వచ్చినప్పుడు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు చెందిన పనులు కూడా ఈ సంస్థకే అప్పగిస్తారు అని...స్థానిక కంపెనీ లను పూర్తిగా విస్మరించి ఒక్క కంపెనీకే రాష్ట్రమంతటా పనులు కేటాయించటం వెనక సీఎంఓ అధికారులతో పాటు కొంత మంది జిఏడీ ప్రోటోకాల్ అధికారుల చేతివాటం ఉంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. సీఎం తో పాటు ఇతర వివిఐపీల కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది అని చెప్పి అధికారులు అటు చిత్తూర్ జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ మూలాన సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇదే సంస్థకు పనులు అప్పగిస్తున్నట్లు చెపుతున్నారు.
ఈ సంస్థకు ఏటా ప్రభుత్వం చెల్లించే బిల్లులు కోట్ల రూపాయల్లో ఉంటాయి అని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల్లో జర్మన్ టెంట్స్ వేయటంతో పాటు డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాట్లు...సౌండ్ సిస్టం ల ఏర్పాటు వంటి పనులను రాష్ట్రానికి చెందిన సంస్థలకు కాకుండా రాజస్థాన్ కు చెందిన సజ్జన్ మాన్ సంస్థకు అప్పగించి రాష్ట్రానికి చెందిన కంపెనీలకు అన్యాయం చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. అయితే ఈ కంపెనీ పై సీఎంఓ అధికారులతో పాటు ప్రోటోకాల్ అధికారులు ప్రత్యేక ప్రేమ చూపించటం వెనక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అని చెపుతున్నారు. అందుకే పలు కీలక జిల్లాల్లో మాన్ సంస్థతో సమానంగా సేవలు అందించే సంస్థలు ఉన్నా కూడా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఒకటే సంస్థకు పనులు కేటాయిస్తున్నారు. ఎంత చిన్న ప్రోగ్రాం అయినా సరే ఈ సంస్థ వేసే బిల్లు కోట్లలోనే ఉంటుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రతి ఏటా నిర్వహించే రిపబ్లిక్ డే...ఇండిపెండెన్స్ డే తో పాటు అన్ని అధికారిక కార్యక్రమాల బాధ్యతలు ఈ సంస్థకే అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచిత్రం ఏమిటి అంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన సమయంలో అప్పటి సీఎంఓ లో ఉన్న కీలక అధికారి అండతో మాన్ సంస్థ ప్రభుత్వంలోకి ఎంట్రీ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో కూడా ఇదే సంస్థ హవా కొనసాగింది. ఇప్పుడు సీఎంఓ లోని మరో ఐఏఎస్ అధికారి అండదండలతో తన హవా ను కొనసాగిస్తోంది అని చెపుతున్నారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కూడా ఏ మాత్రం మారంది మాన్ సంస్థ మాత్రమే అన్నట్లు పరిస్థితి ఉంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.