వైసీపీలో ప్రవీణ్ ప్రకాష్...టీడీపీ లో కార్తికేయ మిశ్రా !

సొంత ఎంపీని ఢిల్లీ వేదికగా అవమానించినా పట్టించుకోలేదు. అంతే కాదు ఏకంగా సహచర సీఎంఓ అధికారితో దురుసుగా వ్యవహరించటం....ఒక కలెక్టర్ అధికారిక నివాసానికి ఏకంగా బూట్లు పంపించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా పై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇన్ని జరిగినా ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా కానీ...అనధికారికంగా కానీ స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపి టోల్ ఫీజు అడిగారు అన్న కారణంతో ఏకంగా సిబ్బందిపై చిందులు వేయటమే కాకుండా ఆ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆ విషయం కూడా మీడియా లో ప్రముఖంగా వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా చంద్రబాబు స్టైల్ తెలిసిన వాళ్లకు ఇది ఏ మాత్రం అంతు చిక్కని వ్యవహారంగా మారింది. ఏ అధికారి వల్ల అయినా...నాయకుడి చేసిన పని వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు మీడియా కు లీకులు ఇచ్చి...ఆయా అధికారులు, నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..మరో సారి పురావృతం అయితే సహించేది లేదు అంటూ వార్తలు రాయించుకునే వాళ్ళు. అది కేవలం కవర్ అప్ కోసం చేసే ప్రయత్నమే తప్ప అందులో వాస్తవం ఉండదు అనే విషయం ఆయన్ను దగ్గర నుంచి చూసిన అందరికి తెలిసిందే.

                                        కానీ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఉత్తుత్తి ఆగ్రహం కూడా వ్యక్తం చేయకపోవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ అధికారిపై మూడు సంఘటనలకు సంబంధించి మీడియా లో ప్రముఖంగా వార్తలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటున్నారు అంటే కార్తికేయ మిశ్రాకు చంద్రబాబు భయపడుతున్నట్లు పరిస్థితి ఉంది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న ఒక కీలక మంత్రి అండదండలతోనే ఆ ఐఏఎస్ అధికారి ఇంతగా రెచ్చిపోతున్నారు అని చెపుతున్నారు అనే చర్చ ఐఏఎస్ సర్కిల్స్ లో సాగుతోంది. కార్తికేయ మిశ్రా ఆదేశాలతో టోల్ గేట్ దగ్గర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు మీడియా లో వచ్చిన వార్తలు పెద్ద దుమారమే రేపాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రైవేట్ చిరు ఉద్యోగుల పొట్టగొట్టడానికా అన్న చందంగా తీవ్ర విమర్శలు రావటంతో వాళ్ళను తిరిగి విధుల్లో తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించి తప్పు దిద్దుకుంది.

                                                గత వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించిన తీరుకి వైసీపీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకుంది అని ఆ పార్టీ నేతలు చెపుతారు. ముఖ్యంగా ఆయన విద్యా శాఖలో ఉన్న సమయంలో టీచర్లను పెద్ద ఎత్తున వేధించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సీఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా టీడీపీ ఎంపీలతో దురుసుగా వ్యవహరించటంతో పాటు తనకంటే సీనియర్ లు అని లేదు..జూనియర్ లు అని లేదు సహచర ఐఏఎస్ లతో కూడా ఆయన చాలా అభ్యంతరకరంగా ఉంటున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఆయన పై మీడియా లో వార్తలు వచ్చిన ప్రతిసారి తన సన్నిహితులు అయిన ఐఏఎస్ అధికారులను కొంత మంది పదే పదే టార్గెట్ చేస్తున్నారు అని ఆ కీలక మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అర్ధం అవుతోంది అనే చర్చ సాగుతోంది టీడీపీ నేతల్లో. ఆయన చేసే పనుల వల్ల ప్రభుత్వానికి...పార్టీకి వచ్చే చెడ్డ పేరు కంటే ఆ ఐఏఎస్ అధికారి గురించే ఆ మంత్రి బాధ పడుతున్నారు అంటే ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

Full View

Tags: