రాయితీల చెల్లింపులకు ఎస్క్రో అకౌంట్స్ అంటూ ప్రకటనలు
దేశంలో ఏ పారిశ్రామిక వేత్త అయినా సరే ముఖ్యమంత్రి బ్రాండ్ చూసి పెట్టుబడులు పెట్టరు. ఆ రాష్ట్రంలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు...అందుబాటులో ఉన్న మానవవనరులు..ముడి సరుకులు. అక్కడి మార్కెట్ తో పాటు ఎగుమతి..దిగుమతులకు ఉన్న అవకాశాలు అన్నవే ఎంతో ముఖ్యం. వీటితో పాటు అత్యంత కీలకం అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు..ప్రోత్సహకాలు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా భూములు ఇవ్వటంతో పాటు వాళ్ళు ఏది కోరిన దానికంటే ఎక్కువ రాయితీలు ఇవ్వటం చంద్రబాబు మోడల్. అందుకే పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఇష్టుడైన రాజకీయ నేత అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. మరో వైపు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కూడిన భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఏది చెపితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేస్తారు అనే పేరు అటు పారిశ్రామిక వర్గాలతో పాటు అధికారుల్లో కూడా ఉంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం అని...నవంబర్ 12 -13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా మరో పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవి అన్నీ కూడా తమ బ్రాండ్ వల్లే రాష్ట్రానికి వస్తున్నాయి అని ఊదర గొడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయన తనయుడు, ఐటి , మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ లు పదే పదే తాము ఎంతో కష్టపడి పెట్టుబడులు సాధించాము అని..తమ బ్రాండ్ వల్లే ఇవి అన్నీ కూడా ఏపీకి వస్తున్నాయి అని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు చెపుతున్నట్లు చంద్రబాబు, లోకేష్ బ్రాండ్ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్లు అయితే...ఆ కంపెనీలకు దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ప్రైవేట్ సంస్థలు ఏమి అడిగితే ఆ రాయితీలు అన్నీ ఎందుకు ఇస్తున్నట్లు?. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఐటి కంపెనీలకు రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు ఎందుకు కేటాయిస్తున్నట్లు?. ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే కంపెనీలు ఈ రాయితీలు...ప్రోత్సహకాల కోసం వస్తున్నాయా...లేక చంద్రబాబు...లోకేష్ ల బ్రాండ్ చూసి వస్తున్నాయా అన్నది ఇక్కడే తేలిపోతుంది. ఇంకో దారుణమైన విషయం ఏమిటి అంటే కొన్ని కంపెనీలు పెట్టే పెట్టుబడుల్లో సగానికి పైగా పదేళ్లలో ప్రభుత్వం నుంచే వివిధ రూపాల్లో అందనున్నాయి . మూలధన సబ్సిడీ పేరుతో ఇప్పటికే ఎన్నో కంపెనీలకు అడ్డగోలు రాయితీలు ఇచ్చారు.
పొరపాటున ప్రభుత్వం మారితే తాము తెచ్చిన కంపెనీల అధినేతలకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు అని చెప్పి చంద్రబాబు ఏకంగా రాయితీల చెల్లింపులకు ఎస్క్రోఅకౌంట్స్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే పారిశ్రామికవేత్తలు తదుపరి వచ్చే ప్రభుత్వాలు ఈ సర్కారు ఇచ్చిన జీవోలను పట్టించుకోకపోతే తమ పరిస్థితి ఏంటి అని అనుమానాలు వ్యక్తం చేస్తే ..దానికి పరిష్కారంగానే ఎస్క్రో అకౌంట్స్ ప్రతిపాదన తెరపైకి తెచ్చి చంద్రబాబు నాయుడు ఇది ఎంతో తమ ఘనత గా ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా భూములు..రాయితీలు ఇవ్వటం ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా సాగుతున్న భూముల కేటాయింపులు...రాయితీల విషయంలో ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు, నారా లోకేష్ లు తమ బ్రాండ్ వల్లే రాష్టానికి పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పుకుంటూ...రాష్ట్ర వనరులను దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు అని అధికార వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.