ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో ఎవరి వసూళ్లు వాళ్ళవే..ఎవరి అవినీతి వాళ్లదే. ఎవరూ ఏ మాత్రం తగ్గటం లేదు. అవినీతికి అవకాశం ఉన్న చోట ఏ ఒక్క ఛాన్స్ ను కూడా వదులుకోవడం లేదు. అసలు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అన్న చందంగా కొంత మంది మంత్రులు దోపిడీకి పాల్పడుతున్నట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు. కూటమిలో కీలక పార్టీలకు చెందిన మంత్రులు కొంత మంది అవినీతి విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నట్లు ఆయా పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఒక ప్రధాన పార్టీకి చెందిన కీలక మంత్రి తాను చేసే వసూళ్లు అన్నిటికి పార్టీ పేరు చెపుతున్నట్లు టీడీపీ నేతలు చెపుతున్నారు. ఏ చిన్న పని విషయంలో ఎవరు సిఫారసు చేసినా ఆయన పట్టించుకోకుండా పార్టీ అన్న తర్వాత ఖర్చులు ఉంటాయి...ఇలా చేస్తేనే కదా పార్టీ నడిచేది అని ఆ మంత్రి చెపుతుండటం చూసి అవాక్కు అవటం కొంత మంది నాయకుల వంతు అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై గతంలో ఎప్పుడూ పెద్దగా ఇలాంటి ఆరోపణలు లేవు కానీ...ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

                                    ప్రభుత్వంలోని మరో కీలక మంత్రి తాను చేసే పనులు అన్నిటికి పై వాళ్ళ పేరు చెపుతుంటే...మరో పార్టీకి చెందిన మంత్రి పార్టీ పేరు చెప్పి తన పని తాను చేసుకుంటున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి ఆ ఇద్దరినీ బియ్యం కలిపింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎవరికీ పెద్దగా అనుమానం రాకుండా ఇద్దరూ కలిసి తెరవెనక అక్రమ దందా నడిపిస్తున్నట్లు చెపుతున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్న మంత్రి కి చెందిన సన్నిహిత బంధువులు బియ్యం అక్రమ దందాలో ఎన్నో ఏళ్లుగా ఆరితేరిపోయారు అని చెపుతున్నారు. అందుకే మరో మంత్రిని తన లైన్ లోకి తెచ్చుకుని ఇద్దరూ కలిసి ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తున్నారు అని చెపుతున్నారు. తన అవసరాల కోసం...అక్రమాలు చేయటం కోసం ఎవరినైనా బుట్టలో వేసుకోవటంలో ఆ మంత్రికి మాస్టర్స్ డిగ్రీ ఉంది అనే చర్చ పార్టీ నేతల్లోనే ఉంది.

                                      రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మంత్రుల అక్రమాల వ్యవహారాలు ఇంకెన్ని ట్విస్ట్ లు తీసుకుంటాయో చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కొంత మంది కీలక మంత్రులపై కూడా వేటు పడుతుంది అనే ప్రచారం టీడీపీ నేతల్లో బలంగా సాగుతోంది. మరి ఆ జాబితాలో పార్టీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే మంత్రితోపాటు ఆ ముదురు మంత్రి ఉంటారా లేదా అన్నది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కాకపోతే ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రుల జాతకాలు ఆయా పార్టీల అధిష్ఠానం దగ్గరకు పక్కాగా చేరింది అని..వీళ్ళు చేస్తున్న పనుల సంగతి కూడా వాళ్లకు తెలుసు అని కీలక నేత ఒకరు వెల్లడించారు.

Tags: