మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ వివాదం ప్రారంభం అయింది. కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజుపై మాన్సాస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘనమైన చరిత్ర ఉన్న వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారంటూ అశోక్ గజపతిరాజు పై ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా అశోక్ గజపతిరాజకు సంచయిత పలు ప్రశ్నలు సంధించారు. ''గజపతి అశోక్ బాబాయ్ ... మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు.
ఆయన రక్షణకోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడటం లేదా? సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు.'' అన్నారు. హైకోర్టు తీర్పుతో మాన్సాస్ ట్రస్ట్ సంచయిత దగ్గర నుంచి మళ్ళీ అశోక్ గజపతిరాజు చేతికి వచ్చిన విషయం తెలిసిందే.