ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లో కోట్ల రూపాయల విలువైన భూములను పెట్టుబడుల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు సర్కారు దోచిపెడుతోంది. ఇందులో ఏ మాత్రం హేతుబద్దత లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు...ఉద్యోగావకాశాల కల్పన పేరు చెపుతోంది. కొన్ని కంపెనీల విషయంలో అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాను ఖరారు చేసిన విధానానికి తానే తూట్లు పొడుచుకుని మరీ ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇప్పుడు తాజాగా మరో విచిత్రమైన కేటాయింపు చేశారు. ముతూట్ ఫిన్ కార్ప్ లిమిటెడ్ వైజాగ్ లో ఇంటిగ్రేటెడ్ ఏఐ హబ్ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చింది. దీని కోసం కంపెనీ 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 2400 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఏఐ హబ్ కోసం తమకు వైజాగ్ కాపులుప్పాడ ప్లాట్ నంబర్ 3 , 4 లో 4 .10 ఎకరాలు కేటాయించాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది.

                                      Full Viewఅయితే ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎస్ఐ పీబీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఓకే చేసింది. కంపెనీ కోరినట్లు 4 .10 ఎకరాలు కాకుండా ఎకరా రెండు కోట్ల రూపాయల లెక్కన 3 ఎకరాలు కేటాయిస్తూ తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐటి శాఖ శుక్రవారం నాడు జీవో జారీ చేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే తక్కువలో తక్కువ కాపులుప్పాడ లో ఎకరా ధర 40 కోట్ల రూపాయల పైమాటే ఉంటుంది. ఈ లెక్కన చూసుకున్నా కంపెనీ 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంటే ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించే భూమి విలువే 120 కోట్ల రూపాయల ఉంటుంది. ఇది ఒక్కటే కాదు ఆంధ్ర ప్రదేశ్ ఐటి, జిసిసి విధానం ప్రకారం ఈ సంస్థకు అన్ని ఇతర రాయితీలు కూడా దక్కుతాయి అని జీవో లో స్పష్టం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఐటి ఆధారిత కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలని నిబంధన పెట్టారు. మరో కీలక విషయం ఏమిటి అంటే 120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కంపెనీ ఆరు కోట్ల రూపాయలకే దక్కించుకోనుంది. అంతే కాకుండా ఇదే భూమిని బ్యాంకు లో తనఖా పెట్టి అతి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని ఈ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది అని ఐటి శాఖ వర్గాలు చెపుతున్నాయి.

Tags: