పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా జనసేన నాయకులు కూడా ఆయన తీరు చూసి అవాక్కు అవుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన దూకుడు చూసి మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పని చేసిన టీడీపీ నాయకులు అయితే షాక్ లో ఉన్నారు అనే చెప్పాలి. ఎవరూ ఊహించని రీతిలో ఆయన తన నియోజవర్గంలో బెట్టింగ్ లు...పేకాట క్లబ్ లు నడుపుతున్నట్లు చెపుతున్నారు. ఈయన నడిపే కేంద్రాల వద్దకు నిత్యం అత్యంత ఖరీదు అయిన కార్లు బారులు తీరుతాయని..ఈ ఎమ్మెల్యే వ్యవహారం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతా ఒకెత్తు అయితే జంగారెడ్డి గూడెం లో సదరు ఎమ్మెల్యే ఒక మహిళ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఒక కొత్త ఇల్లు కట్టించిపెట్టి గృహప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటో లు ఏవీ బయటకు రాకుండా ఆయన గన్ మెన్ లను ఉపయోగించి పక్కా గా ఏర్పాట్లు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఇప్పటికే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఒక మహిళా వివాదంలో చిక్కుకుని పార్టీని ఇరకాటంలోకి నెట్టగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే వ్యవహారం కూడా దీనికి తోడు అయ్యేలా ఉంది అనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది. సదరు గోదావరి జిల్లా కు చెందిన ఎమ్మెల్యే భార్య, ఎమ్మెల్యే బావమరిది తో పాటు ఎమ్మెల్యే తండ్రి కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయటానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే వసూళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవటంతో ఇప్పుడు ఈ తరహా నాయకులు అంతా రెచ్చిపోతున్నారు జనసేన కు చెందిన నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ఫిర్యాదు తో వీళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకు పోగలుగుతారా అన్న అనుమానాలు ఉన్నాయి. పోనీ పార్టీ కీలక నేతలు అయినా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతారో లేదో చూడాలి.