వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన నారా లోకేష్ తిరుపతిలో చేసిన విమర్శలపై వైసీపీ స్పందించింది. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ బుర్ర తక్కువ మాటలు, పిచ్చి చేష్టలను లోకేశ్ మానుకోవాలని అన్నారు. ప్రమాణం చేయాల్సి వస్తే.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవలేదు అని తమరు ప్రమాణం చేయాలని కన్నబాబు ఎద్దేవా చేశారు. తనకు పిల్లను ఇచ్చిన మామ ఇంట్లో కాల్పులు జరుగలేదని, ఎవరినీ రక్తసిక్తం చేయలేదని అని తమరు ప్రమాణం చేయాలని కన్నబాబు వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాల మరణాలకు తన తండ్రి చంద్రబాబు కారణం కాదని ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు.
లోకష్ ను మాస్ హీరోగా చూపించాలని శిక్షణ ఇస్తున్నట్టు ఉన్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. జగన్ సోదరీమణుల గురించి మాట్లాడుతున్నారు.. లోకేష్ కు సంస్కారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తాడిపల్లెలోని జగన్ ఇంటికి రండి.. అది ప్యాలెసా, మామూలు ఇల్లో చూడాలని లోకేష్‌కు ఆయన సవాల్ విసిరారు. లోకేశ్‌తో జగన్‌కు పోలికా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా లోకేశ్‌కూ జగన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్‌కూ, ఒంటి చేత్తో 151 మందిని గెలిపించుకున్న జగన్‌కు పోలిక ఏంటని ఆయన ప్రశ్నించారు.