మెగాస్టార్ చిరంజీవి సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన ఇప్పుడు తన సొంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ పేరు చెప్పటానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు. పక్క రాష్ట్రం...మరో తెలుగు రాష్ట్రం అంటూ చిరంజీవి గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వ్యాఖ్యానించటం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇదొక్కటే కాదు ఈ సారి తెలంగాణ ప్రభుత్వం చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో మాట్లాడిన చిరంజీవి ఎవరి పేరు మీద ఉన్న అవార్డు తాను అందుకున్నారో ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ పేరు ప్రస్తావించకుండా...పక్క రాష్ట్రం...మరో తెలుగు రాష్ట్రం అని మాట్లాడటం ఒకెత్తు అయితే...ఎవరి పేరు మీద ఉన్న అవార్డు అందుకున్నారో వాళ్ళ గురించి గౌరవంగా అయినా రెండు మాటలు మాట్లాడతారు ఎవరైనా. కానీ చిరంజీవి ఆ పని చేయలేదు. దీంతో చిరంజీవి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కళాకారులు, సినిమాల విషయంలో ఆ రంగం వాళ్ళను ఉత్సాహపరిచే విషయంలో మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది అన్నారు. సినిమా వాళ్లకు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే ...వీళ్ళు ఇచ్చే ప్రోత్సహంతో ఎంతో మంది యువకులు మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి రెవెన్యూ కూడా వస్తుంది..స్టేట్ ఎకానమీ కు మేలు అవుతుంది అంటూ...ఈ ఆలోచన చేయాల్సిందిగా వినమ్రంగా విన్నవించుకుంటున్నా అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తున్నారు అన్నారు. తాను సీఎం ని కలిసిన ప్రతిసారి కూడా తెలుగు సినిమా కే కాదు ...భారత దేశ సినిమాకు హైదరాబాద్ ను కేంద్రంగా ఉంచటం. అలా అభివృద్ధి చేయటం గురించే మాట్లాడే వారు. హాలీవుడ్ అంటే అగ్రరాజ్యం గుర్తుకు వస్తుంది అని...ఇండియా సినిమా అంటే హైదరాబాద్ తెలంగాణ గుర్తుకు రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేపడుతున్నారు అని..దానికి తాము అంతా చేదోడు వాడాడు గా ఉంటాం..ఇండస్ట్రీ మీ వైపు ఉంటుంది అని చిరంజీవి ఈ సభలో ప్రకటించారు.
చిరంజీవి ఎన్టీఆర్ అవార్డ్ తీసుకుని కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో చిరంజీవి ఇదే అంశంపై శుక్రవారం ఉదయం ట్వీట్ చేయటం మరింత ఆసక్తి కరంగా మారింది. చిరంజీవి ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు, తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు..
ఎన్టీఆర్ అంటే... N- నాట్యం, T - తాళం, R -రాగం... కళల సమ్మేళనం.
తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు..
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా...
ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ...
రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అని పేర్కొన్నారు.