ఆర్నబ్ సమీక్షలో రెండవ వరసలో కూర్చున్న సిఎస్
విజయానంద్ కు మొదటి వరసలో సీటు
వ్యవస్థలను చంద్రబాబు గౌరవించేది ఇలాగేనా!
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను గౌరవించటం గురించి ఛాన్స్ దొరికినప్పుడల్లా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. తాను తప్ప ముఖ్యమంత్రులు అందరూ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు చెప్పుకుంటారు. కానీ సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సాక్షిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సాయి ప్రసాద్ కు జరిగిన అవమానం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదేనా చంద్రబాబు వ్యవస్థలకు ఇచ్చే గౌరవం అన్న ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఆర్నబ్ తుఫాను అంశంపై సమీక్ష జరిపారు. గత రెండు రోజులుగా ఆయన అధికారులకు ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఇందులో విచిత్రంగా రాష్ట్ర పరిపాలనకు హెడ్ అయిన సిఎస్ ఈ సమీక్ష సమావేశంలో రెండవ వరసలో కూర్చుంటే...సీఎం చంద్రబాబు ముందు పదవి విరమణ చేసిన సిఎస్..విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు కాటంనేని భాస్కర్ తో పాటు ఇతర అధికారులు కూర్చున్నారు.
ఇంకా విచిత్రం ఏమిటి అంటే చంద్రబాబు నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో పలు జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిఎస్ కూర్చున్న చోటు చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు జరగలేదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగానే ఈ ఫోటో లను విడుదల చేసింది. అంటే పద్దతుల విషయంలో అంతా మా ఇష్టం ...ఎవరినైనా ఎక్కడైనా కూర్చోబెడతాం అన్న చందంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఇది ఖచ్చితంగా సిఎస్ కు అవమానమే అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి సంప్రదాయం కాదు అని ఐఏఎస్ లు అభిప్రాయం పడుతున్నారు.
స్వయంగా సిఎం సమీక్షలోనే ఇలా జరిగితే రాష్ట్ర పరిపాలనా యంత్రంగాన్ని ముందు ఉండి నడిపించాల్సిన ఆయనకు ఏమి గౌరవం ఉంటుంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సందేహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పలు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావానికి అనుగుణంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా చూడాలి. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, గాలులు వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలి. గతంలో వచ్చిన తుపాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలి. తీరప్రాంతాల ప్రజల్ని తుపాను షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.