సిసిఎల్ఏ పేరుతో కథ నడిపిస్తున్న రెవిన్యూ శాఖ
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖలో దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలోని కీలక జిల్లాల్లో వేల ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు కీలక నేతలు బిగ్ స్కెచ్ వేశారు. ఇది ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్ద కలకలానికి కారణం అవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు బరితెగింపుకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది అధికార వర్గాలు చెపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అసైన్మెంట్ భూములపై హక్కుదారులకు సర్వహక్కులు ఇచ్చేలా చట్టం తెచ్చారు. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకునే కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వేల ఎకరాల భూములను దక్కించుకునేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. దీని కోసం సర్కారు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్ఏ) పేరుతో ఒక మెమో జారీ చేయించారు. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏమిటి అంటే గతంలో అసైన్మెంట్ భూములు కేటాయించినా కూడా హక్కుదారు పేరు వెబ్ ల్యాండ్ లో లేకపోయినా కూడా తహసీల్దార్ వెబ్ ల్యాండ్ లో హక్కుదారు పేరు ఎక్కించవచ్చు అని వెసులుబాటు ఇచ్చారు. వాస్తవానికి రెవెన్యూ శాఖలో డిజిటలైజేషన్ జరిగి దశాబ్దాలు దాటింది. దీని ప్రకారం అన్ని రకాల భూములు వెబ్ ల్యాండ్ లో ఉంటాయి.
అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం వెబ్ ల్యాండ్ లో అసైన్మెంట్ హక్కుదారుల పేర్లు లేకపోతే చేర్చమని వెసులుబాటు ఇవ్వటం అంటే ఇది భారీ ఎత్తున అక్రమాలకు...వివాదాస్పద భూములను చేజిక్కించుకునే పనిలో భాగంగానే దీన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ రెవెన్యూ శాఖ వర్గాల్లో జరుగుతోంది. వెబ్ ల్యాండ్ పేర్లు లేని అసైన్మెంట్ దారుల వివరాలు నమోదు చేసే సమయంలో విధి, విధానాలు పాటించాలి అని మెమో లో పేర్కొన్నా కూడా ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అని చెపుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు...కృష్ణా జిల్లాలను టార్గెట్ గా చేసుకుని కొంత మంది ప్రజాప్రతినిధులు ఈ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది అని అధికారులు వెల్లడించారు. వెబ్ ల్యాండ్ లో పేర్లు లేని వారు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తాజాగా జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. పంటల బీమాతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు అసైన్మెంట్ హక్కుదారుల పేర్లు అన్ని కూడా వెబ్ ల్యాండ్ లో ఎప్పుడో ఎక్కించుకున్నారు అని...కానీ ఇప్పుడు కీలక జిల్లాల్లో ఉన్న వివాదాస్పద భూములను టార్గెట్ చేసుకుని ఈ ప్లాన్ వేసినట్లు ఉంది అని చెపుతున్నారు.
ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న మంత్రితో పాటు ఇతర కీలక మంత్రులు..కొంత మంది ఎంపీలు...తెర వెనక ఉండి కథ నడిపిస్తున్న రాజ్యాంగేతర శక్తులు ఇందులో ఉన్నట్లు చెపుతున్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటానికి ముందే అప్పటి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వైజాగ్ జిల్లాలో వేల ఎకరాలు దక్కించుకున్నారు. అప్పట్లో వైసీపీ నేతలు కూడా పలు జిల్లాల్లో ఇదే పని చేశారు. ఈ పని చేసిన వాళ్ళతో కూడా కూటమి సర్కారు పెద్దలు సెటిల్మెంట్స్ చేసుకున్నారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త మోడల్ వెతికి కీలక జిల్లాల్లో మరో సారి మిగిలిన భూములు దక్కించుకునే పనిలో పడ్డారు. ఇందులో జగన్ హయాంలో కీలక పాత్ర పోషించిన అధికారి టీం కూడా ఉంది అని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.