ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి టీడీపీ నేతలే అవాక్కు అవుతున్నారు. కొంత మంది మంత్రులను ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా నియంత్రిస్తున్నారు అనే చర్చ అటు ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నేతల్లో కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ తరహా బరితెగింపు గతంలో ఎప్పుడూ లేదు అని చెపుతున్నారు అధికారులు. ముఖ్యంగా కీలక శాఖల్లోని ఈ వ్యవహారం అడ్డగోలుగా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు..విమర్శలు వచ్చే శాఖలో అయితే మంత్రి ఒక కవికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెపుతున్నారు. కవి అంటే అయన ఏదో కవిత్వాలు రాస్తాడు అనుకుంటే పొరపాటే. ఆయన ఆ కీలక మంత్రికి చెందిన అవినీతి వ్యవహారాలతో పాటు ఇతర అన్ని విషయాలు చూసుకుంటాడు అని ఆయన కేబినెట్ సహచరులే చర్చించుకుంటున్నారు. ఒక్కో పనికి ఒక్కొక్కరులా ఇలా కొంత మంది ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని ఆ మంత్రి తమ శాఖ వ్యవహారాలు నడిపిస్తున్నారు అని...వసూళ్లతో పాటు అన్ని పనులు వీళ్ళే చేసుకుంటున్నట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. మంత్రి మాత్రం రిలాక్స్డ్ గా తనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటే...శాఖ వ్యవహారాలు వీళ్ళు చక్కపెడుతున్నారు అని అధికారులు చెపుతున్నారు.
ఆ శాఖ పరిధిలోకి వచ్చే అప్పీల్స్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం ప్రత్యేక టీం పెట్టుకున్నారు అని...ఆ టీం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఫైనల్ గా నిర్ణయం బయటకు రాదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇది ఒక వ్యవహారం అయితే మరో కీలక ..పవర్ ఫుల్ శాఖలో కూడా ఢిల్లీ లో ఒకరిని పెట్టి కథ నడిపించటంతో పాటు అమరావతిలో కూడా అసలు ఆ శాఖకు ఏ మాత్రం సంబంధము లేని వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించి ప్రభుత్వ శాఖలను ప్రైవేట్ వ్యవహారంలాగా మార్చివేసినట్లు చెపుతున్నారు. ఈ కీలక శాఖలో కొంత మంది ఉన్నతాధికారుల పెత్తనం...కొన్ని ప్రైవేట్ కంపెనీల పెత్తనంతో పాటు గుత్తాధిపత్యం సాగుతోంది. మరో కీలక మంత్రి ఇన్వాల్వ్ మెంట్ అయితే ఇక చెప్పేపనిలేదు. ఆయన ఫైల్స్ మీద సంతకాలు చేయరు కానీ..నిర్ణయాలు అన్ని ఆయనవే అని చెపుతారు. తన శాఖలో ఎవరో పనులు చేయించుకుంటుంటే తాను మాత్రం ఖాళీ గా ఎందుకు ఉండాలి అని ఆ మంత్రి కూడా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపి భారీ ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి.
దగ్గర దగ్గర ఆరేడు శాఖల మంత్రుల దగ్గర ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగి ఆయా శాఖలకు చెందిన వ్యవహారాలు..సెటిల్మెంట్స్ చూడటంతో పాటు మంత్రులను కూడా తమ గుప్పిటలో పెట్టుకుంటున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. ఎప్పుడైనా లెక్క తేడా వస్తే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ జాతకాలే కాకుండా అవినీతి విషయం కూడా మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు మంతులు ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయా మంత్రుల దగ్గర జరుగుతున్న ప్రైవేట్ వ్యవహారాలను పట్టించుకోవటం లేదు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం ఒక్క సారి దృష్టి సారిస్తే చాలు వీళ్ళ జాతకాలు అన్ని బయటకు వస్తాయని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఆరేడు కీలక శాఖల వ్యవహారాల్లో అన్ని పనులను సిండికేట్ లే నడిపిస్తున్నాయి అని..గత వైసీపీ ప్రభుత్వంలో హవా చెలాయించిన వాళ్లే ఇప్పుడు కూడా ఆయా శాఖల్లో అలవోకగా పనులు చేయించుకోవటంతో పాటు పెత్తనం చెలాయిస్తున్నట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు.