ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రతి నెలా అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం ముందుకు సాగలేని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే సంపద సృష్టి అసలు జరుగుతుందో లేదో తెలియదు కానీ..కొంత మంది మంత్రుల సంపద మాత్రం అమాంతంగా పెరిగిపోతోంది అని ఐఏఎస్ అధికారులు చెపుతున్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా అప్పుల సృష్టిలో కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ లు నిత్యం ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు అనే వార్తలు చాలానే వచ్చాయి. ముఖ్యమంత్రికి ప్రత్యేక విమానాల్లో తిరిగే వెసులుబాటు ఉంటుంది.
కానీ ఈ సారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా విరివిగా స్పెషల్ ఫ్లైట్స్ వాడినట్లు చెపుతున్నారు. అయితే ఈ విమాన ఖర్చులు ఎవరు భరించారు...ఇవి అధికారికమా...అనధికారికంగా అన్న విషయాలు మాత్రం బయటకు రావటం లేదు. వీళ్ళ ముగ్గురి సంగతి అటుంచితే గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కీలక శాఖలు చూస్తున్న మరో ఇద్దరు మంత్రులు కూడా తరచుగా ప్రత్యేక విమానాలు వాడుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోనే అవినీతిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మంత్రి ఒకరు అయితే...మరొకరు పవర్ ఫుల్ శాఖను చూస్తున్న మంత్రి. వీళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్స్ రేంజ్ నుంచి ఏ మాత్రం దిగటం లేదు అని టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి.
వారి వారి శాఖల్లో ఆ ఇద్దరు మంత్రుల అవినీతి కూడా కొత్త పుంతలు తొక్కుతుంది అనే ప్రచారం గత కొంత కాలంగా సాగుతోంది. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు..కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్లినా కూడా ఇప్పుడు ప్రత్యేక విమానాలు వాడుతుండటం టీడీపీ నేతల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక విమానాలు వాడే వాళ్ళ సంఖ్య మూడు ఉంటే ఇప్పుడు అది ఐదుకు పెరిగింది అని అధికారులు చెపుతున్నారు. అవినీతి సొమ్ము ఎంత భారీ మొత్తంలో పోగుపడుతుంటే వీళ్ళు ఇలా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించగలరు అనే చర్చ కూడా సాగుతోంది.