తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పరిపాలనలో హ్యూమన్ టచ్ ఉండాలి అని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. ఒక్కో టర్మ్ కు ఒక్కో బజ్ వర్డ్ తో పెద్ద ఎత్తున తన అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకోవటం చంద్రబాబు మోడల్. తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవటమే. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో ఈ సారి హ్యూమన్ టచ్ కంటే ఎక్కువగా కరప్షన్ టచ్...ఇతర టచ్ లు ఎక్కువ అయ్యాయనే ప్రచారం ప్రభుత్వ వర్గాలతో పాటు టీడీపీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ కేంద్రంగా సాగిస్తున్న వ్యవహారాలు ఇప్పుడు టీడీపీ లో హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ళిద్దరూ తమ శాఖలకు చెందిన వ్యవహారాల సెటిల్మెంట్స్ చేసుకోవటంతో ఇతర వ్యవహారాలు అన్నీ ఈ హోటల్ వైదికగా జోరుగా సాగిస్తున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
ఇందులో ఒక మంత్రి వ్యవహారం ఇప్పటికే ఒక సారి బయటకు వచ్చింది. అయినా కూడా ఆయన ఏ మాత్రం వెరపు లేకుండా ప్లేస్ మార్చారు తప్ప...తన మోడల్ మార్చలేదు ... ఆయన పనులు ఏ మాత్రం ఆగలేదు. పైగా గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దల అండదండలు మరింత పెరగటంతో ఇప్పుడు ఆ కీలక మంత్రి మరింత రెచ్చిపోతున్నారు అని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా మరో పవర్ ఫుల్ మంత్రి కూడా చేరినట్లు టీడీపీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ ఇద్దరు మంత్రులు అవినీతి విషయంలో కూడా పోటీలు పడే స్థాయిలో ఉన్నారు అని టీడీపీ లో ప్రచారం జరుగుతోంది. ఈ మంత్రులు ఇద్దరూ ఒక స్టార్ హోటల్ లో పర్మినెంట్ రూమ్స్ పెట్టుకున్నారు అని...అయితే అధికారికంగా అవి వాళ్ళ పేర్ల మీద ఎక్కడా ఉండవు అని తెలిపారు. కానీ ఆ ఇద్దరి మంత్రుల అక్రమ కార్యకలాపాలకు మాత్రం ఇవే వేదికగా నిలుస్తున్నాయి అని చెపుతున్నారు.
ఇందులో ఒక మంత్రికి సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని...ఆయన వాళ్ళ దగ్గర తన అవినీతిలో సొమ్ములో పెద్ద మొత్తాలు పెట్టుబడులు పెట్టినట్లు కూడా చెపుతున్నారు. దీంతో ఆ మంత్రి అవసరాలు అన్నీ కూడా కోహినూర్ వేదికగా ఆ సినీ పరిశ్రమ కీలక వ్యక్తులే చూసుకుంటున్నట్లు ఒక మంత్రి వెల్లడించారు. విచిత్రం ఏమిటి అంటే గతంలో ఒక మంత్రి పై అయినా..లేదా ఒక అధికారిపై ఆరోపణలు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎన్ని ఆరోపణలు వస్తే వాళ్ళు అంత గొప్ప పనిమంతులు అన్నట్లు వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. వై ఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అప్పటిలో కొంత మంది ఐఏఎస్ అధికారులు ఇలానే బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక స్టార్ హోటల్ లో ఇలానే పర్మినెంట్ రూమ్స్ పెట్టుకున్నట్లు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణకు చెందిన కొంత మంది మంత్రులు ...ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏపీకి చెందిన ఇద్దరు కీలక మంత్రులు పూర్తిగా అవినీతిలో మునిగిపోయి తాము సంపాదించిన డబ్బును ఇలా హైదరాబాద్ వేదికగా విలాసాలకు ఖర్చుచేస్తున్నారు అని ఒక సీనియర్ మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అధికారంలోకి ఉన్న వాళ్లకు సాగునీటి ప్రాజెక్టులు..ఇతర ప్రాజెక్టుల కారణంగా విచ్చలవిడిగా డబ్బు వచ్చి చేరుతుండంతో కొంత మంది మంత్రులతో పాటు కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా పూర్తిగా దారితప్పారు అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లోనే సాగుతోంది.