ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అయింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మంత్రులు కెటీఆర్, నిరంజన్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరింది. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించారు.
మంత్రి కేటీఆర్ సారధ్యంలోని బృందం లేవనెత్తిన అంశాలపై 26వ తేదీన తమ నిర్ణయం చెబుతామని కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో ఈ నె26వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. ధాన్యం కొనుగోలు పరిమితి స్వల్పంగా పెంచేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. పీయూష్ గోయెల్ తో భేటీ అనంతరం ఇదే బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోనూ చర్చలు జరిపారు.