తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతున్న అసలు పరీక్ష ఇదే. ఫిబ్రవరి 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్ పై జరుగుతాయి అనే విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎవరి బలం ఎంత అన్నది ఇప్పుడు స్పష్టంగా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ సీట్లు దక్కించుకున్నా కూడా ఇవి పార్టీ సింబల్ పై జరిగినవి కాకపోవటంతో ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ కూడా పంచాయతీ ఎన్నికల్లో తామే మెజారిటీ స్థానాలు గెలిచామని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండదు. పార్టీ సింబల్స్ తో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎవరూ ఫేక్ క్లెయిమ్స్ చేసుకునే ఛాన్స్ ఉండదు. పంచాయతీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం కాస్త గట్టిగానే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ కీలక ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది.
అధికార కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్, బీజేపీ లు ఈ ఎన్నికలపై బాగానే ఫోకస్ పెట్టాయి. సోమవారం సాయంత్రంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 11 న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలట్ విధానంలో జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13 న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవి అయినా కూడా సహజంగా అధికార పార్టీ కి కొంత సానుకూలత ఉంటుంది. పైగా దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉండనుంది. ఈ తరుణంలో ఎక్కువ ఛాన్స్ లు అధికార పార్టీ అభ్యర్థులకు కల్పిస్తే ఎంతో కొంత డెవలప్ మెంట్ కు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని ప్రజలు భావిస్తారు. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా..ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలు విషయంలో దారుణంగా విఫలం అయ్యారు అని...కాంగ్రెస్ ని ఓడిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది...అప్పుడే హామీలు అన్నీ అమలు అవుతాయి అని పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది.
మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు జిల్లాల్లో పర్యటించి పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు...తమ పాలనకు మధ్య తేడా చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గత పన్నెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు అని...ఆ పార్టీ కి ఓటు వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకోకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో ఆయన కు రాజకీయంగా పెద్ద సవాళ్లు ఎదురుకాలేదు.