ఈవీ ట్రాన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా నియామకం

Update: 2026-02-14 16:07 GMT

వి వి లక్ష్మీనారాయణ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కరలేని పేరు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణ మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ పోస్ట్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కంపెనీ లింక్డిన్ లో అధికారికంగా వెల్లడించింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సు ఆపరేటర్ గా ఉంది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నమోదు అయిన పలు కేసులను విచారించారు. జగన్ మోహన్ రెడ్డి ని అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఆయనే సిబిఐ జె డీ గా ఉన్నారు. ఆ తర్వాత అంటే 2018 లో లక్ష్మీనారాయణ విఆర్ఎస్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

                                   Full Viewఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన లో చేరి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తర్వాత కొద్దికాలానికి జనసేన కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక కొత్త పార్టీ ని కూడా స్టార్ట్ చేశారు. రాజకీయాల్లో సక్సెస్ సాధించలేకపోయిన ఆయన ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటి మద్రాస్ లో ఎం టెక్ చేసిన లక్ష్మీనారాయణ తన కెరీర్ ను తొలుత అశోక్ లేలాండ్ కంపెనీ ఆటోమోటివ్ ఆర్ అండ్ డి విభాగంలో మొదలుపెట్టారు అని ఈవీ ట్రాన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ రంగాల్లో లక్ష్మీనారాయణ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడనుంది అని, తమ కంపెనీలోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News