తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో విచారణ క్లైమాక్స్ కు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో బిఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు లను ఇప్పటికే సిట్ విచారించిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ హయాంలో సాగిన టెలిఫోన్ ట్యాపింగ్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం శ్రీష్టించింది. ఈ ట్యాపింగ్ ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్లతో పాటు కొంత మంది జడ్జిల ఫోన్లు...మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కేసు కూడా నమోదు అయింది. ఈ అంశంలోఇప్పటికే కీలక నేతల విచారణలు పూర్తి కావటంతో ఇప్పుడు ఫైనల్ గా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు రంగం సిద్ధం అయింది.