ప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!

Update: 2026-01-21 09:34 GMT

ప్రతిసారి ఇదే పాట...ఎవరికి భయపడి ఈ మాటలు!

చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఒకసారి ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గా కూడా పని చేశారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత ఆయనకు రాజ్య సభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ దగ్గర నుంచి ఛాన్స్ దొరికిన ప్రతిసారి బీజేపీ నేతలు చిరంజీవి పై ఫోకస్ పెడుతూ వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో స్వయంగా ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమాలకు కూడా చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. ఇది అంతా గతం. గత కొంత కాలంగా చిరంజీవి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ లో అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం మెగా స్టార్ చిరంజీవిని ఆహ్వానించింది.

                                            అయితే ఈ సమావేశ వేదిక నుంచి మాట్లాడిన చిరంజీవి ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎలాగైనా రావాలని సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పంపించారు అని, అప్పుడు తాను ఏ పొజిషన్ లో ఉన్నానో తెలుసా.. అన్నపూర్ణ స్టూడియోలో ఎవరో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను అంటూ అదే వేదికపై చెప్పారు. ఇది అంతా తనకే ఏదోలా అనిపించింది అని.. ఇదొక గొప్ప సమ్మిట్.. తెలంగాణ రైజింగ్ అనేది ఒక కొత్త ఇనిషియేటివ్. చాలా ఆనందంతో ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలింహబ్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల కిందటే చెప్పారు. ఈ సమ్మిట్ చూసిన తర్వాత సీఎం అనుకున్నది సాధిస్తారనే నమ్మకం వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే తనను ఇద్దరు మంత్రులను పంపి ప్రభుత్వం ఆహ్వానించింది అని ఆ వేదికగా మీద చిరంజీవి చెప్పాల్సిన అవసరం ఉందా అని అప్పటిలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి...తెలంగాణా ప్రభుత్వ పరువు తీయటమే అనే చర్చ అప్పటిలో సాగింది.

                                                ఇప్పుడు అలాంటిదే మరో సీన్ రిపీట్ అయింది. అదేంటి అంటే ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు దావోస్ టూర్ లో విన్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీనికి సంబదించిన ఫోటో లు కూడా విడుదల అయ్యాయి. దీనిపై చిరంజీవి టీం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జ్యూరిచ్‌లో వ్యక్తిగత విరామంలో ఉన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు చిరంజీవి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 2026కు హాజరయ్యారు అని వెల్లడించారు. సీఎం ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు అని.. ఈ సందర్భంగా వారు ‘తెలంగాణ రైజింగ్ 2047’ గ్లోబల్ ఆవిష్కరణను ప్రత్యక్షంగా వీక్షించారు అని వెల్లడించారు.

                                            Full Viewఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పుడు సీఎం తన కుటుంబంతో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూశానని, ఎంతో ఆస్వాదించానని తెలిపారు అని చిరంజీవి టీం తన ప్రకటనలో వెల్లడించింది. ప్రతి సారి కూడా చిరంజీవి సీఎం పిలుపు మేరకే తాను ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తోంది అని చెప్పటం వెనక ఉద్దేశం ఏంటి..ఈ మాటలు చెప్పటం ద్వారా చిరంజీవి ఎవరికైనా ఏమైనా సంకేతాలు పంపుతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇలా ప్రతి కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలవటం..వచ్చిన ప్రతిచోట కూడా ఆయన సీఎం పిలిస్తే వచ్చా తప్ప ...తనకు వీటిపై ఏ మాత్రం ఇంటరెస్ట్ లేదు అన్న తరహాలో చేస్తున్న ప్రకటనలు ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు తీయటంతో పాటు ప్రభుత్వ పరువు కూడా తీస్తున్నాయి అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News