తెలంగాణలో సింగరేణి బొగ్గు స్కాం వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఈ విషయంలో బుక్ అయినట్లే ఉంది అనే చర్చ కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది. గత వారం ఆంధ్ర జ్యోతి పత్రికలో ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. సింగరేణి కి చెందిన ఒరిస్సాలోని నైని కోల్ బ్లాక్ లో ఓవర్ బర్డెన్ తొలగింపు కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మెగా ఇంజనీరింగ్ అధినేత మేఘ కృష్ణా రెడ్డి, ఎన్ టివీ చైర్మన్ నరేంద్ర చౌదరి సమావేశం అయ్యారు అని సంచలన అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి ఇది అంతా తప్పు అని...ఆంధ్ర జ్యోతిలో వచ్చిన కథనం వెనక ఎవరు ఉన్నారో...ఎవరి ప్రయోజనాల కోసం ఇది అంతా రాసారో తర్వాత చెపుతాను అంటూ ప్రకటించి నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇందులో ఎలాంటి గోల్ మాల్ ...స్కాం లేకపోతే సైట్ విజిట్ చేసిన కంపెనీలు అన్నిటికి ఆ సర్టిఫికెట్ ఇస్తే సరిపోయేదానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగమేఘాల మీద టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం కూడా ఎన్నో అనుమానాలకు కారణం అయింది.
పైగా కంపెనీలు ఏవీ ఇంకా అధికారికంగా టెండర్లు వేయలేదు అని అధికారులు చెప్పినా కూడా తానే అనుమానాలకు తావు ఇవ్వకూడదు అని ఇలా చేసినట్లు భట్టి మీడియా సమావేశంలో చెప్పారు. గతంలో చెప్పినట్లుగానే ఉప ముఖ్యమంత్రి...తెలంగాణ విద్యుత్, ఆర్థిక శాఖలు చూస్తున్న మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్ర జ్యోతి లో వచ్చింది అంతా కట్టు కథ అని..ఈ వార్త తప్పు అని చెపుతారు అని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. అయినా సరే ఆంధ్ర జ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ మాత్రం తన ఆర్టికల్ లో మరో సారి నైని కోల్ బ్లాక్ పొందటం కోసం భట్టి విక్రమార్క, మేఘా కృష్ణా రెడ్డి, ఎన్ టివీ యాజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించటం నిజం కాదా...ఈ ముగ్గురు ఉన్నప్పుడు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించటం నిజం కాదా అని మరో సారి ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆంధ్ర జ్యోతి మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదు అనే విషయం స్పష్టం అయింది.
మరో వైపు ఇదే అంశంపై బిఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశంపై మరో సారి స్పందించారు. సైట్ విజిట్ నిబంధన తాము కొత్తగా తెచ్చింది కాదు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెపుతున్నారు అని..కానీ ఎక్కడా కూడా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులకు ఇలాంటి నిబంధన లేదు అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి తెచ్చారు అని చెప్పారు. అంతే కాదు సైట్ విజిట్ చేసిన ప్రముఖ కంపెనీలు అయిన ఎన్ సిసి , మహాలక్ష్మి వంటి సంస్థలు తమకు సర్టిఫికెట్ ఇవ్వటం లేదు అని సింగరేణి ఉన్నతాధికారులకు మెయిల్స్ పెట్టాయని..సర్టిఫికెట్ ఇవ్వాల్సిన సింగరేణి జీఎం ఆఫీస్ ముందు సెల్ఫీ లు దిగి మరీ వాటిని కూడా అధికారులకు పంపించారు అని హరీష్ రావు వెల్లడించారు.
ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తాను ఈ విషయాలు అన్ని ఆధారాలతో సహా బయటపెడతా అన్నారు. ఈ వ్యవహారాలు అన్ని చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుక్ అయినట్లే కనిపిస్తోంది అనే చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా సాగుతోంది. ఆంధ్ర జ్యోతి యాజమాన్యాన్ని తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేసిన మల్లు భట్టి విక్రమార్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పటితో ఆగేలా లేదు అనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో కూడా సాగుతోంది. మరో వైపు కేంద్రం కూడా ఈ విషయంలో రంగంలోకి దిగటంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ కూడా కొంత మంది నాయకుల్లో ఉంది.