పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

Update: 2021-03-01 12:33 GMT

తెలంగాణలో కలకలం రేపిన న్యాయవాదుల హత్య ఘటనకు సంబంధించి సాగుతున్న విచారణ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై పలు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసు వ్యవహారంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన విచారణ నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఏ2, ఏ3ల స్టేట్‌మెంట్‌ని ఎందుకు సెక్షన్‌ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్‌ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్‌ లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్‌ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్‌డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు.

హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్‌ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందుకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి నుంచి ఇంకా అదనపు సాక్ష్యాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది.

Tags:    

Similar News