చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్

Update: 2021-03-01 12:48 GMT

రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కింద కూర్చుని చేస్తున్న నిరసనపై అధికార వైసీపీ మండిపడింది. ఇదో రాజకీయ డ్రామాగా అభివర్ణించింది. చంద్రబాబు చేస్తున్న డ్రామాను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవటంలేదని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని బతికించుకోవటానికే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని...దీనికి ఆయనకు మద్దతుగా ఉండే మీడియా కూడా వంత పాడుతోందని ఆయన ఆరోపించారు. గతంలో జగన్ ను వైజాగ్ లో అడుగుపెట్టకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగి ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో కనీసం ఎలాంటి ఆంక్షలు లేవని..ప్రస్తుతం కోవిడ్ నిబంధనలతోపాటు..ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఇది కుట్రపూరితంగా చేస్తున్న పనే అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అనుమతి ఇవ్వరని..అనుమతిలేదనే విషయం తెలిసి కూడా కావాలనే సీన్ క్రియేట్ చేయటానికి వెళ్ళారని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నాడని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. తమను విశాఖ ఎయిర్‌పోర్టులో ఆపినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని మండిపడ్డారు. చంద్రబాబు ఉదయం నుంచి రేణిగుంటలో ఒక హై డ్రామా నడుపుతున్నారని, బాబు ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించేవారు కాదని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News