అదే సమయంలో సెకి తో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే ప్రభుత్వం పై మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పుకొచ్చారు. అంటే ప్రజలపై వచ్చే 20 నుంచి 25 సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు ...తాము ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కట్టలేము అన్న చందంగా వ్యవహరించారు. దీంతో సెకి ఒప్పందం చంద్రబాబు హయాంలో కూడా అలా అలవోకగా సాగిపోతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇదే అంశంపై కోర్ట్ లో కేసు వేయటమే కాకుండా...మీడియా ముందుకు కూడా రాష్ట్ర సంపదను జగన్ మోహన్ రెడ్డి టానికి దోచిపెడుతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్ అంతా గప్ చుప్. ఇందులో అత్యంత కీలకం అయిన విషయం ఏమిటి అంటే స్వయంగా చంద్రబాబు నాయుడే జగన్ సెకి ఒప్పందంలో లడ్డూలా దొరికాడు అని చెప్పి ఈ విషయాన్ని పూర్తిగా వదిలేయటం. పొరుగునే ఉన్న తమిళనాడు లో మాత్రం అదానీ కంపెనీల విషయంలో రాష్ట్ర ప్రజలపై అధికార భారం పడుతుంది అని ఒప్పందాలు రద్దు చేసుకుంటే...ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇది భారీ స్కాం అని ఆరోపించటమే కాకుండా...రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల భారం అని చెప్పి కూడా వదిలేశారు అంటే దీని వెనక ఎంతో గోల్ మాల్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెకి ఒప్పందంపై ఎన్నో విమర్శలు చేయగా...అప్పటిలో విద్యుత్ శాఖలో కీలక స్థానంలో ఉన్న ప్రస్తుత సిఎస్ విజయానంద్ మాత్రం ఇదో చారిత్రిక ఒప్పందం...రైతుల కోసమే జగన్ ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆయన్ను ఏకంగా సిఎస్ చేయటమే కాకుండా...అత్యంత కీలక మైన విద్యుత్ శాఖను కూడా ఆయనకే అప్పగించి నడిపిస్తోంది. ఫిబ్రవరి 28 న పదవి విరమణ చేయనున్న విజయానంద్ కు మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. సాక్షి మీడియా విషయంలో అయినా...సెకి ఒప్పందం విషయంలో అయినా సరే తాము జగన్ జోలికి వెళ్ళం అన్న చందంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో వ్యవహరిస్తోంది. అయితే టీడీపీ సెకి విషయంలో ఆరోపణలు చేసినప్పుడు దేశంలో అందరి కంటే తక్కువ ధరకే తాము ఒప్పందాలు చేసుకున్నాం అని చెపుతూ వచ్చింది. ఇప్పుడు అసలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెకి ఒప్పందం ఒకటి ఉంది అనే విషయం ఏ మాత్రం గుర్తులేనట్లు పనిచేసుకుంటూ వెళుతోంది.