రాజకీయమే అజెండా!

Update: 2026-02-24 06:49 GMT

వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి మీడియా తో పాటు భారతి సిమెంట్స్ కు వెయ్యి కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది చేకూరింది అని మంత్రి నారా లోకేష్ తాజాగా ఆరోపించారు. సోమవారం నాడు అసెంబ్లీ లాబీల్లో మీడియా తో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం అనుచిత లబ్ది అంటే నిబంధనలకు విరుద్ధంగా..అక్రమ మార్గంలో ప్రయోజనం పొందినట్లే లెక్క. మరి ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నా కూడా ప్రజల సొమ్మును అక్రమంగా పొందిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఈ ప్రశ్నకు నారా లోకేష్ దగ్గర సమాధానం ఉందా?. ఈ విషయాన్ని అలా వదిలేశారు అంటే రాజకీయంగా ..తమకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవటం..తర్వాత దీన్ని పూర్తిగా వదిలేయటమే కూటమి విధానమా?.

                                         ఒక వైపు వెయ్యి కోట్ల రూపాయలు అక్రమ లబ్ది పొందినట్లు ఆరోపిస్తూ ఇలా ప్రయోజనం పొందిన వాళ్లపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు అంటే దీని వెనక ఉన్న కథ ఏంటి?. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసుకున్నారు..మా హయాంలో మేము చేసుకుంటాం అన్న చందంగా వదిలేశారా?. వైసీపీ ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలి కి చెందిన హెరిటేజ్ -ఇందాపూర్ డెయిరీ వివాదాన్ని తెర మీదకు తెచ్చినందుకు నారా లోకేష్ ఇప్పుడు సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ అంశాన్ని లేవనెత్తారా అన్న చర్చ సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందిన విషయం నిజమే. సర్క్యూలేషన్ విషయంలో నంబర్ వన్ గా ఉన్న ఈనాడు కంటే సాక్షి కే అప్పటిలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకున్నారు. రేట్ కార్డు ను కూడా గతం కంటే ఏకంగా 50 శాతం పైగా పెంచుకున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇవి అన్ని కూడా అధికారికంగా ఉన్న విషయాలే. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

                               క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి నారా లోకేష్ తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండంపై మీడియా తో పాటు రాజకీయంగా కూడా దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశం పై కూడా చిట్ చాట్ లో స్పందించిన నారా లోకేష్ టి ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కు చేరితే తాను మళ్ళీ మ్యాచ్ చూడటానికి వెళతానని... వస్తానంటే జగన్ కు కూడా తానే టికెట్ కొంటానని వ్యాఖ్యానించారు. ఒక వైపు సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ ద్వారానే ఐదేళ్ల లో వెయ్యి కోట్ల రుపాయల మేర అనుచిత లబ్దిపొందారు అని విమర్శిస్తూ మళ్ళీ జగన్ కు తాను టికెట్ కొంటానని చెప్పటం ద్వారా నారా లోకేష్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో అర్ధం కావటం లేదు అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహిత పారిశ్రామికవేత్తగా పేరు ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీ ఇండోసోల్ ను ఒకప్పుడు ఫేక్ పెట్టుబడుల కంపెనీ అని..ఈ కంపెనీ అడ్రస్ కూడా పులివెందులే అని విమర్శించిన నారా లోకేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసిన కూడా నోరెత్తడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ మాటలకు..అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్స్ కు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ పాత విషయాల్లో సర్దుబాట్లకు ఒకే చెప్పి...కొత్త విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు చంద్రబాబు క్యాబినెట్ లోని మంత్రులు కూడా చెపుతున్నారు.

Tags:    

Similar News