ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసి) చైర్మన్ నియామకం మాత్రం జరగలేదు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎఫ్ డీసి చైర్మన్ పోస్ట్ కు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తన సినిమా హరి హర వీర మల్లు నిర్మాత ఏ ఎం రత్నం పేరును ప్రతిపాదించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక సారి బహిరంగంగానే చెప్పారు. ఆయన ఈ ప్రకటన చేసింది 2025 జులైలో. కానీ విచిత్రం ఏమిటి అంటే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ డీసి చైర్మన్ పోస్ట్ ను మాత్రం భర్తీ చేయలేదు. పవన్ కళ్యాణ్ బహిరంగంగా తన నిర్మాత ఏ ఎం రత్నం కు ఈ పోస్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ని కోరినట్లు బహిరంగంగా చెప్పినా కూడా ఇప్పటి వరకు ఈ విషయాన్ని చంద్రబాబు పట్టించుకున్నట్లు కనిపించటం లేదు.
అయితే పవన్ కళ్యాణ్ ఏ ఎం రత్నం పేరు ప్రతిపాదించినప్పుడే పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కొంత మంది ఈ విషయాన్ని బహిరంగంగా కూడా ప్రస్తావించారు. అయితే ఎఫ్ డీసి చైర్మన్ పోస్ట్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూ పూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఈ పోస్ట్ కు వేరే వాళ్ళ పేరు సూచించటం వాళ్లే ఇప్పటి వరకు ఎఫ్ డీసి చైర్మన్ పోస్ట్ భర్తీ చేయలేదు అని చెపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై బాలకృష్ణ గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుంచో టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కొద్ది నెలల క్రితం హిందూపూర్ నియోజకవర్గంలో ఆయన అభిమానులు నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ ఆయన ముందే ప్లకార్డు లు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఇది అంతా కూడా బాలకృష్ణ అనుమతి లేకుండా జరగదు అనే అభిప్రాయాన్ని కొంత మంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.