అంతా మా ఇష్టం !

Update: 2026-03-12 12:57 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరిష్టం వాళ్లదే అన్నట్లు ఉంది తీరు. గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితులు లేవు అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లోనే ఉంది. కూటమి ప్రభుత్వం కావటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి కూడా పూర్తి కంట్రోల్ లేకుండా పోయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశా, నిర్దేశం చేశారు. అయితే అత్యంత కీలకమైన ఈ కలెక్టర్ల సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మరో కీలక మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కాలేదు. రెండు రోజుల సమావేశంలో వీళ్ళిద్దరూ ఒక్క రోజు కూడా పాల్గొన లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పనుల్లో బిజీ గా ఉన్నారో..లేక మరో కారణమో తెలియదు కానీ ఆయన ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఒక్క కలెక్టర్ల సమావేశాలే కాదు...గతంలో కొన్ని సార్లు మంత్రి వర్గ సమావేశాలకు...అసెంబ్లీ సెషన్ కూడా కూడా ఆయన దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి.

                                      కొన్ని సార్లు అయితే అనారోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉన్నట్లు చెప్పారు కానీ..మరి కొన్నిసార్లు అసలు కారణాలు కూడా బయటకు రావు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందే పవన్ కళ్యాణ్ తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కు డబ్బింగ్ చెపుతున్నట్లు చిత్ర యూనిట్ ఫోటో లు కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా పనుల కోసం కలెక్టర్ల సమావేశానికి హాజరు కాలేదు అన్న చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గురువారం నాడు జరిగిన రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ అంశాలు రావటం...వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమావేశంలో అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి..ఇదే అంశంపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో మాట్లాడానని..మరో సారి మాట్లాడతాను అని ఈ సమావేశంలో చెప్పారు.

                                     రాష్ట్రంలో పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ... ఫారెస్ట్ మారలేకపోతోందంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు సీఎం. ఇది ఇలా ఉంటే మరో కీలక మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు ఢిల్లీ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంట్లో విందుకు హాజరు కావటంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం నాడు విశాఖపట్నంలో క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈఓ తో పాటు ఇతరులతో సమావేశం అయి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. నారా లోకేష్ కూడా గతంలో మంత్రి వర్గ సమావేశాలకు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా కూడా ఇతర మంత్రులు అంతా కలెక్టర్ల సమావేశంలో పాల్గొంటే...పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు మాత్రం ఈ కీలక సమావేశాలకు డుమ్మాకొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం నారా లోకేష్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ కార్యక్రమంలో అటు పరిశ్రమల శాఖ మంత్రి కానీ...జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒక్కరు కూడా లేకుండా నారా లోకేష్ మాత్రమే అంతా నడిపించటం విశేషం.

Full View

Tags:    

Similar News