పెద్ద ఎత్తున రంగంలోకి ఎన్ఆర్ఐ లు !
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో శాఖ ఏది అయినా ఆయన మనుషులదే హవా. దీని కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఆ కీలక మంత్రి ఏకంగా కొన్ని టీం లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఎన్ఆర్ఐ లు కూడా పెద్ద ఎత్తున ఉండటం విశేషం. ప్రభుత్వంలో భారీ భారీ డీల్స్ అన్ని కూడా కిమ్ టీం ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. విద్యుత్ ప్రాజెక్ట్ లతో మైనింగ్ ప్రాజెక్ట్ లు ...ఇతర అన్ని విషయాలు కిమ్ టీం డీల్ చేస్తున్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ లోని మంత్రులే చెపుతున్నారు. పోనీ ఇవన్నీ సీఎం కు తెలియదకుండా జరుగుతున్నాయా అంటే ఏ మాత్రం అవకాశం లేదు అని...ఈ సారి చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఉన్నట్లు కాకుండా ఇప్పుడు పూర్తిగా పగ్గాలు వదిలేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ అధికార టీడీపీ నేతల్లోనే ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో ఒక అవినీతి రాజా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ అవినీతి రాజా కూడా ఎన్ఆర్ఐ నే కావటం విశేషం.
ఏకంగా ఆయన ఇప్పుడు భారీ రాబడి వచ్చే ఏడు ఇసుక రీచ్ లు నిర్వహిస్తున్నట్లు ఒక మంత్రి వెల్లడించారు. అంతే కాదు...ఎక్సైజ్ శాఖ లో సాఫ్ట్వేర్ పనులతో ఇతర కీలక పనులు కూడా దక్కించుకున్నట్లు చెపుతున్నారు. ఇక్కడిదో ఆగలేదు ఆయన. పలు కీలక శాఖల బదిలీల వ్యవహారంలో కూడా జోక్యం చేస్తుంటున్నారు అని ఉన్నతతాధికారులు చెపుతున్నారు. ఆయన కీలక మంత్రికి అత్యంత సన్నిహితుడుగా చలామణి అవుతుండటంతో అధికారులకు కూడా ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఒక ఎన్ఆర్ఐ అనుమతి లేకుండా రెవెన్యూ శాఖలో కీలక ఫైల్స్ ఏవీ కూడా ముందుకు కదలటం లేదు అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా కీలక ఫైల్స్ అన్ని కూడా ఆయన నుంచి ఫోన్ వస్తేనే క్లియర్ అవుతున్నాయి. ఈ విషయం ఆ శాఖ కు చెందిన అధికారులే చెపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అవినీతి రాజా ఒక నెల రోజులు ఇక్కడ...మరో నెల రోజులు అమెరికా లో ఉంటూ కీలక మంత్రి తరపున వ్యవహారాలు అన్నీ చక్కబెడుతున్నారు అని మంత్రుల్లోనే ప్రచారంలో ఉంది.
కొంత మంది అయితే అవినీతి రూపంలో సంపాదించిన మొత్తాన్ని రూట్ చేసేందుకు కూడా ఆయన్ను ఆ కీలక మంత్రి వాడుకుంటున్నారు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైంది అనే ప్రచారం ప్రభుత్వం ఏర్పాటు అయి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే రావటం ఏ మాత్రం మంచి పరిణామం కాదు అని టీడీపీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వంలో సాగిన పలు అక్రమాలకు చెందిన విషయాల్లో కూడా కీలక మంత్రి టీం లు రంగంలోకి దిగి సెటిల్మెంట్స్ చేసుకోవటంతో వేల కొత్త రూపాయలు వెనకేసుకున్నాయి అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వంలోని కీలక నేతలు తీరు చూసి కొంత మంది ఉన్నతాధికారులు సైతం ఇదే బాటలో ఉన్నారు అనే చర్చ పెద్ద ఎత్తున అధికార వర్గాల్లో సాగుతోంది.