ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ సానుభూతి పరులకు పెద్ద ఎత్తున కీలక పోస్టింగ్ లు దక్కుతున్నట్లు మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అంతే కాదు..స్వయంగా టీడీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా గతంలో ఎన్నడూ లేని రీతిలో అధిష్ఠానంపై ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు లో కూడా ఒక కీలక ఐఏఎస్ పోస్టింగ్ విషయంలో వైసీపీ సిఫారసు వర్క్ అవుట్ అయినట్లు అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఐఏఎస్ కు వైసీపీ లింక్ లు ఉన్నాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. అదే సమాయంలో బిఆర్ఎస్ కీలక నేతల సిఫారసు తో ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని తనకు ఎంతో సన్నిహితుడు అయిన మంత్రి ద్వారా వైసీపీ కీలక నేత సిఫారసు చేయటంతో అది కార్యరూపం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది. సహజంగా అలాంటి పోస్ట్ లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడిని వేసుకుంటారు.
ఎందుకంటే ఆ అధికారికి ప్రభుత్వంలోని సున్నిత సమాచారం అంతా తెలుస్తుంది. అంతే కానీ అలాంటి పోస్టుల్లో మంత్రి కి కావాల్సిన వాళ్ళను..ఎవరో సిఫారసు చేసిన వాళ్ళను వేసుకోరు అని ఒక అధికారి అబిప్రయపడ్డారు. వాస్తవానికి గత బిఆర్ఎస్ హయాంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొని...భూ లావాదేవీల్లో కీలక పాత్ర పోషించిన అధికారి కోసం ఏకంగా ఏపీ నుంచి సిఫారసు రావటం..అది అమల్లోకి రావటం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి తెలంగాణ లో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన వెంటనే గతంలో కీలక జిలాల్లో కలెక్టర్లుగా పని చేసి...పెద్ద ఎత్తున భూ దందాల్లో ఉన్న వారిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్లపై విమర్శలు చేయటమే. కానీ అదేమీ జరగలేదు. కానీ విచిత్రంగా ఈడీ ఎంటర్ ఇచ్చి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ను మూడు రోజులు ప్రశ్నించటం అధికార వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఒక ఐఏఎస్ పోస్టింగ్ ఇప్పుడు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.