బిఆర్ఎస్ బెదిరింపు రాజకీయం ఎన్నికల్లో బయటపడేందుకేనా?

Update: 2023-11-17 06:12 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారాన్నే ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ ముగ్గురి ప్రచారం చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగటం సహజం. ఆ ముగ్గురు ఎవరో కాదు. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు. తెలంగాణ లో తాము తప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం అంత అల్లకల్లోలం అవుతుంది అనే తీరులో ఈ ముగ్గురి ప్రచారం ఉండటం చూసి అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీరు చూస్తున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ ఎలాగైనా ప్రజలను భయపెట్టి బయటపడాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు కెసిఆర్ దగ్గరి నుంచి కేటీఆర్, హరీష్ రావు లు అందరిది ఒకటే మాట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు వస్తాయి...రైతు బంధు రాదు...పరిశ్రమలు రావు, సంక్షేమం ఆగిపోతుంది...అభివృద్ధి జరగదు..అంతా అరాచకం తప్ప మరొకటి ఉండదు అన్న చందంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ వీళ్ళు చెపుతున్న అంత దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు ఎక్కడా..ఎవరూ చెప్పటం లేదు. కానీ తెలంగాణాలో దగ్గరదగ్గర పదేళ్లుగా పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ చేసిన పనులు చెప్పుకోవటం కంటే ప్రజలను బెదిరించే మోడల్ నే ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.

                                             Full Viewఈ ప్రచారం ద్వారా బిఆర్ఎస్ తాజాగా బయటపడ్డ లక్ష కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం వైఫల్యాలు వంటి వాటిపై పెద్దగా ఎక్కడా చర్చ జరగకుండా చూసుకుంటుంది అనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావుడి ప్రారంభం అయినప్పటి నుంచి మౌత్ టాక్ విషయంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదే సమయంలో రెండు టర్మ్ లు గెలిచిన బిఆర్ఎస్ కు వ్యతిరేకత సహజమే. ముఖ్యంగా యువతలో బిఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం ఉంది. అదే సమయంలో ఉద్యోగులు..కౌలు రైతులు...వివిధ వర్గాల ప్రజల్లో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ప్రజల్లోకి బాగావెళ్లటం తో బిఆర్ఎస్ కూడా వాటిలో కీలకమైన హామీలను అటు ఇటు మార్పులు చేసి తమ మేనిఫెస్టో లో కూడా పెట్టాల్సిన పరిస్థితి అందరూ చూసిందే. కాంగ్రెస్, బీజేపీ లకు ఓటు వేస్తే చెత్తకుప్పలో వేసినట్లే అని కెసిఆర్ అంటుంటే...కాంగ్రెస్ మాటలు నమ్మితే అంధకారమే అని కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో బయటపడేందుకు బిఆర్ఎస్ నేతలు ఎంచుకున్న భయపెట్టే రాజకీయం వాళ్ళను బయటపడేస్తుందో లేదో డిసెంబర్ మూడున కానీ తేలదు.

Tags:    

Similar News