కవిత ఇంకెన్ని విషయాలు చెపుతారో!

Update: 2025-09-02 16:01 GMT

ఒక వైపు కాళేశ్వరం పై సిబిఐ విచారణకు రేవంత్ సర్కారు ఆదేశం. మరో వైపు బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. కాళేశ్వరం విచారణ పై తెలంగాణ హై కోర్ట్ లో బిఆర్ఎస్ నేతలకు ఊరట దక్కినా..ఇది తాత్కాలికమే అని చెపుతున్నారు. కెసిఆర్ కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అనకొండలు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, మేఘా కృష్ణా రెడ్డి అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు ఇంతకాలం కాళేశ్వరం లో అసలు అవినీతి ఎక్కడ జరిగింది అంటూ ప్రశ్నిస్తూ వచ్చిన బిఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. స్వయంగా కెసిఆర్ కుమార్తె ఈ విషయం చెప్పటం తో ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది అనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇది ఒకటి అయితే రాబోయే రోజుల్లో కవిత ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో అన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అంశంపై కవిత బుధవారం స్పందించనున్నారు. ఆమె పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, అరెస్ట్ అయి జైలు కు వెళ్ళినప్పుడు కూడా ఆమె పై ఎలాంటి చర్యలు తీసుకొని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పుడు మాత్రం కాళేశ్వరం అవినీతి విషయంలో ప్రధాన పాత్ర మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు లదే అని చెప్పినపుడు చర్యలు తీసుకోవటం ప్రజలకు తప్పుడు సంకేతం పంపే అవకాశం ఉంది అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.

                                   అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ని కకావికలం చేసిందో ఇప్పుడు బిఆర్ఎస్ కు కూడా తెలంగాణ లో అదే పరిస్థితి ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. కాళేశ్వరం తో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని విచారణలు తెరమీదకు వచ్చి..కవిత ఇదే తరహాలో మరికొన్ని సంచలన విషయాలు బహిర్గతం చేస్తే అది రాబోయే రోజుల్లో పార్టీ కి మరింత ఇబ్బందికర వాతావరం ఎదురయ్యే అవకాశం ఉంది అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు సిబిఐ రంగంలోకి దిగి కాళేశ్వరం పై విచారణ ప్రారంభిస్తే మాజీ సీఎం కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు లు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ కేసు ను ఎటు వైపు తీసుకెళుతుంది అన్నదే ఇప్పుడు కీలకం కాబోతోంది. 

Tags:    

Similar News