ఈడీ ఎంట్రీ తర్వాత అధికారుల్లో కలకలం!

Update: 2024-10-25 13:39 GMT

విచిత్రం అంటే ఇదే. కేంద్ర విచారణ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత మూడు రోజులుగా ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ను విచారించింది. ఏకంగా ఈ విచారణ మూడు రోజుల పాటు సాగింది. ఇది తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారటం తో పాటు దుమారం రేపుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అమోయ్ కుమార్ దందాలపై ఈడీకి సమాచారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు బిఎస్ఎస్ హయాంలో సాగిన ఈ అక్రమ వ్యవహారాలపై సమాచారం లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. లేకపోతే సమాచారం ఉన్నా కూడా వేరే కారణాలతో వదిలేశారా? అన్న అంశం ఇప్పుడు తెరమీదకు వస్తోంది. ధరణి ని అడ్డం పెట్టుకుని కీలక జిల్లాల కలెక్టర్ లు పెద్ద ఎత్తున అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అమోయ్ కుమార్ తో పాటు మరి కొంత మంది హైదరాబాద్ చుట్టుపక్కల కీలక జిల్లాల కలెక్టర్లు గా సుదీర్ఘకాలం కొనసాగారు. వీళ్ళలో చాలా మంది జూనియర్లు అయిన కూడా చెప్పినట్లు పనులు చేస్తారనే ఉద్దేశంతో ఈ కీలక జిల్లాలు అప్పగించినట్లు అధికార వర్గాల్లో అప్పటిలోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. కొంత మంది కలెక్టర్లు అధికార పార్టీకి చెందిన పెద్దలు చెప్పిన పనులు అన్ని చేసి కోట్ల రూపాయలు కూడా బెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

                                                                              అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వీళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరుగా కలెక్టర్ల పేర్లు చెప్పకపోయినా వారు పని చేస్తున్న జిల్లాలను ప్రస్తావించటంతో అది ఎవరో అందరికి తెలిసిందే. నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రగతి భవన్ లో పని చేస్తూ కెసిఆర్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడుతున్నారు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అమోయ్ కుమార్ విషయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వటంతో మరో సారి ఈ విషయం తెరమీదకు వచ్చింది. ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున కొత్త ఫిర్యాదులు అందుతున్నాయి. బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా...ఇప్పుడు ఇదే అంశంలో ఈడీ ఎంట్రీ ఇవ్వటం ప్రభుత్వానికి పరువు తక్కువ వ్యవహారం అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇప్పుడు ఈడీ చేసిన పని ముందే ఆయా కలెక్టర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న సంస్థలతో విచారణ జరిపించి అక్రమాలు నిగ్గుతేల్చి ఉంటే గౌరవంగా ఉండేది అని..అలాంటిది ఏమి లేకపోయినా గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళకే ఇప్పుడు కూడా కీలక స్థానాల్లో అలాగే కొనసాగిస్తున్న తీరుపై కూడా చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందితో తెరవెనక ఒప్పందాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News