కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అనుమానాలు!

Update: 2024-09-24 06:41 GMT

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాజెక్ట్ పై చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని అందరూ పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. ఈ స్కాం వెనక అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హస్తం ఉంది అని...ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ విషయం ఊసు ఎత్తేవాళ్లే లేరు. విచిత్రం ఏమిటి అంటే ఇదే అంశంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు కూడా. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆర్థిక శాఖ నుంచి, హెచ్ ఎండీఏ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిధులు మంజూరు చేయటంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రైవేట్ సంస్థల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా ఎలాంటి చర్యలు లేవు అంటే...అరవింద్ కుమార్ ఇచ్చిన సమాధానంతోనే ప్రభుత్వం సంతృప్తి చెందిందా..అప్పటి మంత్రి కేటీఆర్ తప్పేమి లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చినట్లు అయింది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.

                                                   కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను నిధులు మంజూరు చేసినట్లు అరవింద్ కుమార్ తనకు అందిన నోటీసు కు సమాధానం చెప్పినట్లు కూడా అప్పటిలో వార్తలు వచ్చాయి. కోడ్ ఉన్న సమయంలో ముఖ్యమంత్రి తో సహా అధికారులు మంత్రుల ఆదేశాలు పాటించాల్సిన అవసరం ఉండదు. మరి ఈ సమాధానంతో రేవంత్ రెడ్డి సర్కారు ఎలా సంతృప్తి చెందింది అన్నది కూడా ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఒక వైపు ఏమీ లేని విషయాల్లో కూడా కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ నిత్యం విమర్శలు గుప్పిస్తుంటే...అడ్డంగా దొరికిన విషయంలో కూడా అయనకు కనీసం ఎలాంటి నోటీసు లు ఇవ్వకపోవటం ..చర్యలకు ఉపక్రమించకపోవటం అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహణలోనే ఉండటం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఫార్ములా ఈ రేస్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

                                                 ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న గ్రీన్‌కో కంపెనీ.. ఆ తర్వాత తప్పుకుంది. దీంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్.. ఈ రేస్ నిర్వహణ కంపెనీకి 55 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అప్పటిలో దీనిపైనే పెద్ద దుమారం నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ప్రకటించింది. నిజంగా అంతా సీరియస్ గా తీసుకుంటే ...ఇలానే ఉంటుందా అన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. కొన్ని విషయాలపై అప్పటికపుడు హడావుడి చేయటం..తర్వాత వాటిని పూర్తిగా వదిలేస్తుండంతో కాంగ్రెస్ ప్రభుత్వ క్రెడిబిలిటీ పైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News