కెసిఆర్ ఎప్పుడూ అంతేనా?!

Update: 2024-02-10 11:53 GMT

అధికారంలో ఉంటే సచివాలయానికి రారు. ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీ కూడా రారా?. ఇది ఇప్పుడు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి సాగుతున్న చర్చ. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత కెసిఆర్ అసెంబ్లీ కి హాజరుపై పలు చర్చలు సాగాయి..పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తొలి సెషన్ కు కెసిఆర్ తుంటి ఆపరేషన్ కారణంగా దూరంగా ఉన్నారు. అయితే అయన తాజగా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిన విషయం తెలిసిందే. తర్వాత తెలంగాణ భవన్ లో పార్టీ కార్యక్రంలో పాల్గొన్నారు కూడా. శనివారం నాటి సమావేశాలకు కెసిఆర్ హాజరు అవుతారు అని మీడియా కు లీక్ లు ఇచ్చి పత్రికల్లో వార్త అయితే రాయించుకున్నారు. కానీ అయన శనివారం నాడు కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో కెసిఆర్ అసలు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా...రారా అన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీ హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకు కూర్చుంటాడు అని ఆశపడిన తెలంగాణ సీఎం సీట్ లో తాను కూర్చున్నందుకు తట్టుకోలేక కెసిఆర్ అసెంబ్లీ రావటంలేదేమో అని రేవంత్ ఎద్దేవా చేస్తున్నారు.

                                            అయితే ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ సమావేశాలకు దూరంగా ఉంటడంపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలకు వస్తున్నా అయన మాత్రం దూరంగా ఉంటున్నారు. నడిపించాల్సిన నాయకుడు ఇలా చేయటం ఏంటి అన్నది చర్చనీయాంశగా మారింది. బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకులను కూడా ఇంత వరకూ ప్రకటించలేదు. ఒక వైపు ఈ నెల పదమూడున నల్గొండ లో బహిరంగ సభకు సిద్ధం అవుతూ కెసిఆర్ అసెంబ్లీ కి హాజరు కాకపోవటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అని బిఆర్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ ఎంతో గొప్పగా చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ..అందులో భాగం అయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ డొల్లతనంపై వరస విచారణలకు ఆదేశిస్తుండం కూడా రాబోయే రోజుల్లో అటు కెసిఆర్ ను...బిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టటం ఖాయం. ఇదెక్కటే కాదు...రేరా కార్యదర్శి బాల కృష్ణ అరెస్ట్ తో గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News