పెట్టుబడుల డ్రైవింగ్ ఫోర్స్ లు అవే !

Update: 2025-01-24 08:02 GMT

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు తమకు తప్ప దేశంలో ఎవరికీ పాలన చేత కాదు అన్నట్లు వ్యవహరించారు కెసిఆర్, కేటీఆర్ లు. అంతే కాదు...దేశానికే తాము దారి చూపిస్తున్నాం అని కూడా చెప్పుకున్నారు. ఇక మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయానికి వస్తే అసలు హైదరాబాద్ లో తన వల్లే ఐటి రంగం ఇంతగా అభివృద్ధి అయింది...పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తాము ఉంటే తప్ప ఐటి రంగం అభివృద్ధి జరగదు..కాంగ్రెస్ వస్తే అంతా ఖల్లాస్ అంటూ ప్రచారం హోరెత్తించారు. కానీ ఇది అంతా తప్పు అని తేలిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ కు...తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విషయంలో కెసిఆర్, కేటీఆర్ వాదనల్లో ఏ మాత్రం నిజం లేదు అని స్పష్టం అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాజా దావోస్ సదస్సు ద్వారా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు.

                                                   తెలంగాణా ప్రభుత్వం ఈ సారి రికార్డు స్థాయిలో రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎప్పుడూ రానంత మొత్తంలో ఏకంగా లక్షా డెబ్భై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. బిఆర్ఎస్ పాలన చివరి సంవత్సరం అంటే 2023 జనవరి లో అప్పటి మంత్రి కేటీఆర్ దావోస్ కు వెళ్లి చేసుకున్న ఒప్పందాల మొత్తం విలువ 21000 కోట్ల రూపాయలు. వాటితో పోలిస్తే లక్షా డెబ్భై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంత ఎక్కువో చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు..2024 లో కూడా రేవంత్ రెడ్డి టీం దావోస్ వెళ్లి చేసుకున్న ఒప్పందాలు కూడా బిఆర్ఎస్ చివరి ఏడాది కంటే ఎక్కువే. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు అనే దాని కంటే కూడా తెలంగాణ లో ముఖ్యంగా హైదరాబాద్ కు ఉండే పలు సానుకూలతలు మాత్రమే దావోస్ లో ఒప్పందాలు ఆయినా..ఇతర అంశాల్లో అయినా కూడా ఉపయోగపడుతున్నాయి.

                                                       అంతే తప్ప  బిఆర్ఎస్..కేటీఆర్ ఉంటేనే హైదరాబాద్ లో..తెలంగాణాలో పెట్టుబడులు పెడతాం అని ఎవరూ చెప్పారు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలు అయినా..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎంఓయూలు అయినా కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు చూసి వస్తున్నవే తప్ప ఇందులో నాయకుల పాత్ర తక్కువే అని చెప్పొచ్చు. కాకపోతే ఎవరు అధికారంలో ఉంటే ఆ సమయంలో క్రెడిట్ వాళ్లకు దక్కుతుంది. అయితే ప్రభుత్వం స్పందించే అంశాల ఆధారంగా కూడా పెట్టుబడిదారుల నిర్ణయాలు ఉంటాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కేటీఆర్ అంత హంగామా చేయకపోయినా కూడా తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తాజా దావోస్ సదస్సుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసింది ఈ ప్రాంతంలో ఉన్న సానుకూల అంశాల ఆధారంగానే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తారు తప్ప...వ్యక్తుల వల్ల కాదు అన్నదే. అయితే ఈ భారీ ఒప్పందాలను విజయవంతంగా గ్రౌండ్ చేసి ఆ మేరకు ఉపాధి అవకాశాలు కలిపిస్తే ప్రభుత్వం ఇమేజ్ మరింత పెరుగుతుంది అంతంలో సందేహం లేదు.

Tags:    

Similar News