కేంద్ర మొండి వైఖ‌రి స‌రికాదు

Update: 2021-08-03 13:23 GMT

కేంద్రం భేషజాలకు వెళ్లకుండా, పెద్ద మనస్సు చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను తక్షణమే పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపుకు మార్గం ఉంటుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26 లో Subject (సబ్జెక్టు) అనే పదం తొలగించి.. Not withstanding ( ఏదీ ఏమీ అయినప్పటికీ కూడా ) అనే పదాన్ని చేర్చి చట్ట సవరణ చేసి అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. చిన్న సవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజన చట్టంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సవరణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టంలో సవరణలు చేసి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని వినోద్ కుమార్ అన్నారు.

శాసన మండలి సీట్లను కూడా పెంచారని అన్నారు. అప్పుడు చట్ట సవరణకు మనస్సు వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా.. అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జవాబిస్తూ 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పడం చూస్తుంటే పాత చింతకాయ సమాధానంగా ఉందని వినోద్ కుమార్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టానని, ఎంపీ కేశవరావుతో కలిసి తాను అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించామని, అప్పుడు న్యాయ శాఖ ఉన్నతాధికారులు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

Tags:    

Similar News