ఎన్నికల షెడ్యూల్ ముందు అసలు పనులు సాగుతాయా?

Update: 2023-06-23 06:55 GMT

Full Viewరాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశం అయి ఆయా శాఖల అంశాలపై మాట్లాడటం మాములుగా అయితే అత్యంత రొటీన్ వ్యవహారం. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నీతి ఆయోగ్ వంటి కీలక సమావేశాలతో పాటు కేంద్రం నిర్వహించే పలు అధికారిక సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. అదేమంటే అసలు వాళ్ళు మన మాట ఏమీ వినరు అని...వాళ్ళు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేసుకునేటప్పుడు మనం ఎందుకు ఆ మీటింగ్స్ లో పాల్గొనాలి అంటూ ఎదురుప్రశ్నలు వేస్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తాజా ఢిల్లీ పర్యటన అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కెటిఆర్ తన పర్యటనలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా కలవనున్నట్లు సమాచారం. పెండింగ్ సమస్యలపై మాట్లాడానికే ఈ ఢిల్లీ టూర్ అని చెపుతున్నా దీని వెనక అసలు కథ వేరే ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ 2023 లోనే రానుంది. అంటే ఇంకా కేవలం రెండు అంటే రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు కెటిఆర్ ఢిల్లీ వెళ్లి ఆగమేఘాలమీద అమిత్ షా, రాజనాథ్ సింగ్ వంటి మంత్రులను కలిసి అనుమతులు సాధించినా ఎన్నికల సమయంలో ఏ పనులు కూడా చకచకా సాగే అవకాశమే లేదు. మరి అలాంటిది ఇప్పుడు కెటిఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అంటే దీని వెనక అభివృద్ధి కంటే ఎక్కువ రాజకీయ కారణాలే ఉన్నాయనే చర్చ సాగుతోంది.

                                           గత కొంత కాలంగా ఐటి శాఖ తో పాటు, ఈడీ లు తెలంగాణాలో రియల్ ఎస్టేట్ సంస్థలు, మెడికల్ కాలేజీలు ఇలా పలు కీలక సంస్థల్లో దాడులు చేసి పెద్ద ఎత్తున సమాచారం సేకరించింది. పలు రియల్ ఎస్టేట్ సంస్థల వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఏజెన్సీలు సేకరించిన సమాచారాన్ని కేంద్రంలోని బీజేపీ కూడా ఎన్నికల సమయంలోనే వాడుకుంటుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విషయంలో విచారణ సంస్థల దూకుడు తగ్గించాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోడీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన కెసిఆర్ ఇప్పుడు మోడీ తనకు మంచి మిత్రుడు అంటూ మహారాష్ట్ర పర్యటనలో ప్రకటించి అందరిని ఒకింత షాక్ కు గురి చేశారు అని చెప్పొచ్చు. ఇప్పుడు కెటిఆర్ రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఢిల్లీ టూర్ పెట్టుకోవటం వెనక రాజకీయ అంశాలే తప్ప పైకి చెపుతున్నట్లు అభివృద్ధి అంశాలకు ఛాన్స్ తక్కువ అని..మహా ఉంటే ఎప్పటిలాగానే ఏ మంత్రికి ఆ మంత్రికి వినతి పత్రాలు ఇస్తారు...లోపల మాట్లాడే అంశాలు మాత్రం వేరుగా ఉంటాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న వేళ కెటిఆర్ పాత ఎజెండా తో కొత్త టూర్ పెట్టుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags:    

Similar News