టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి

Update: 2020-12-01 03:45 GMT

ఒకప్పుడు అసెంబ్లీలో నోముల నర్సింహయ్య మాట్లాడుతున్నారు అంటే అందరూ ఆసక్తిగా వినేవారు. అధికార పార్టీ వైఫల్యాలను వివరించటంలో ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారు. చాలా మందికి నోముల నర్సింహయ్య అంటే సీపీఎం ఎమ్మెల్యేగానే గుర్తొస్తారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన సీపీఎంకు గుడ్ బై చెప్పి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం నోముల నర్సింహయ్య అదే పార్టీ నుంచి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని ఓడించి ఆయన విజయం సాధించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న నోముల మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల నర్సింహయ్య 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై తన గళం విన్పించారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News