కోమటిరెడ్డి పేల్చిన సినిమా టికెట్స్ బాంబు !

Update: 2026-01-10 15:42 GMT

ప్రభుత్వంలో ఏ శాఖ బాధ్యతలు ఆ శాఖ మంత్రి మాత్రమే చూసుకుంటారు. ఇతర మంత్రులకు అందులో జోక్యం చేసుకొనే అవకాశం ఉండదు. అవసరం అయితే ఏ శాఖలో అయినా జోక్యం చేసుకునే అధికారం ఒక్క ముఖ్యమంత్రికే మాత్రమే ఉంటుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో దుమారం రేపుతున్న సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్కారుపై బాంబు వేసినంత పని చేశారు. పుష్ప 2 వివాదం తర్వాత నుంచి తన దగ్గరకు అసలు సినిమా టికెట్ రేట్ల పెంపు...ప్రీమియర్ షోస్ ఫైల్స్ పంపవద్దని ఆదేశించాను అని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మరో వైపు సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంపు ఫైల్స్ పై తాను సంతకాలు చేయలేదు అని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. ఒక్క సినిమా కు కూడా తాను అనుమతి ఇవ్వలేదు అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ...రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రాజాసాబ్ విషయంలో తెలంగాణ హై కోర్టు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన తర్వాత కూడా చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కు కూడా టికెట్ రేట్లు పెంచటంతో పాటు స్పెషల్ షో కు అనుమతి మంజూరు చేశారు.

                                         మంత్రి స్వయంగా తాను ఒక్క సినిమా కు కూడా అనుమతి ఇవ్వలేదు అని చెప్పటంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కీలకం గా మారింది. ఈ లెక్కన సినిమా డీల్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాత్రమే జరిగి ఉంటాయి తప్ప..అధికారులు ఎవరూ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. పుష్ప 2 వివాదం సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సీఎం గా ఉన్నంత కాలం ప్రీమియర్ షోస్ తో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఉండదు అని ప్రకటించారు. కానీ ఇది జరిగిన కొద్దిరోజులకే ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనకు కూడా తూట్లు పొడిచారు. ఇప్పుడు స్వయంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పటంతో ఈ మొత్తం వ్యవహారం ఒక్క సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో తప్ప జరిగే ఛాన్స్ లేదు అని ప్రభుత్వ వర్గాలు కూడా చెపుతున్నాయి.

                                              సినిమాల వ్యవహారంలో నిత్యం సీఎం కు వెన్నంటి ఉండే ఒక వ్యక్తి కీలకంగా మారారు అని....ఈ తతంగం అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది అని కాంగ్రెస్ నాయకులు కూడా చెపుతున్నారు. రాజాసాబ్ సినిమాకు గురువారం అర్ధరాత్రి వరకు రేట్ల పెంపు మెమో ఇవ్వకుండా చేసి...ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాకు మాత్రం చాలా ముందుగా అనుమతి ఇచ్చారు అంటే తెర వెనక జరిగిన వ్యవహారాలే కీలకంగా మారాయి అన్న చర్చ కూడా సాగుతోంది. కొద్ది నెలల క్రితం తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు కూడా తనకు తెలియకుండా డిస్టిలరీస్ కు అనుమతి ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పటిలో ఈ నిర్ణయం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగింది అని...అయినా మంత్రి నేరుగా సీఎం పై కాకుండా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో అప్పటిలో ఈ డిస్టిలరీస్అ నుమతుల నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు. అంటే ఛాన్స్ ఉన్న ప్రతిచోట కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ మంత్రుల్లో ఉంది. పరిశ్రమలో శాఖలో కూడా పలు విషయాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది.

Full View

Tags:    

Similar News