పువ్వాడ అజయ్ కు మళ్లీ కరోనా

Update: 2021-05-01 14:53 GMT

ఎన్నికల ప్రభావం వల్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోందని చెబుతున్నారు నిపుణులు. నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాతే ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఒక్క కెసీఆరే కాకుండా..సాగర్ అభ్యర్ధి నోముల భగత్ తోపాటు మరికొంత కూడా కరోనా బాధితులుగా మారారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వంతు అయింది. ఆయనకు కరోనా సోకటం ఇది రెండవసారి. తేలికపాటి లక్షణాలు ఉండడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా శనివారం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

దీంతో మంత్రి వెంటనే హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి అజయ్‌ కుమార్ ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News