పాఠశాలలు ప్రారంభించే విషయంలో తెలంగాణ సర్కారు నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జులై 1 నుంచి పాఠశాలల ప్రత్యక్షంగా ప్రారంభించాలని తలపెట్టారు. కానీ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పాటు కేంద్రంలోని నిపుణులు కూడా పాఠశాలల ప్రారంభం విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. అంతే కాకుండా దీనిపై హైకోర్టులో కేసు కూడా దాఖలైంది. ఓ వైపు థర్డ్ వేవ్..మరో వైపు డెల్లా ప్లస్ వేరియంట్ వార్తలు వస్తున్న తరుణంలో ఎలా ప్రారంభిస్తారని కోర్టు కూడా ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. దీంతో సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకుంది. జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని అంటూనే...ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన నిర్వహించనుంది.
50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రైవేట్ స్కూళ్లు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ - టీఎస్ నాయకులు శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్ లైన్ లోనే విద్యాబోధన కొనసాగించాలని, 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని వారు సీఎం కెసిఆర్ కు విన్నవించారు.