దేశ వ్యాప్తంగా కరోనా కాస్త శాంతించటంతో దేశ వ్యాప్తంగా పాఠశాలలు క్రమక్రమంగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. తెలంగాణ సర్కారు కూడా ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆన్ లైన్ లోనే పాఠాలు కొనసాగిస్తున్నారు. ఎక్కువ కాలం ఇలా ఆన్ లైన్ క్లాస్ లు కొనసాగించటం మంచిది కాదని..సంవత్సరాల తరబడి పిల్లలను పాఠశాలలకు దూరం చేయటం వల్ల కూడా కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య శాఖ పాఠశాలల ప్రారంభానికి సంబంధించి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై సీఎం కెసీఆర్ సోమవారం నాడు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులతో సమావేశం నిర్వహించారు.
ఇందులోనే పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పిబ్రవరి ప్రాంతంలో కొన్ని రోజులు పాఠశాలలు ప్రారంభించినా మళ్ళీ కరోనా కేసులు పెరగటంతో పాఠశాలలు మూసేశారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు అన్ని తరగతుల క్లాస్ లు నేరుగా ప్రారంభిస్తారా? లేక ఉన్నత తరగతుల వారికే ఇది పరిమితం చేస్తారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఈ స్పష్టత ఇవ్వనుంది. ముఖ్యంగా 8వ తరగతి నుంచి అయితే విద్యార్ధులకు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నారు.