అధికారికం. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో పాఠశాలలను ఫిబ్రవరి 1 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇటీవల పాఠశాలతోపాటు ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఓ వైపు ఇంజనీరింగ్ కాలేజీలకు సెలవులు ఇస్తూ..స్కూళ్లు ఎలా తెరుస్తారంటూ ప్రశ్నించింది.
రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. వైద్య శాఖ కూడా ఈ మేరకు సూచన చేసిందని సమాచారం.