లాక్ డౌన్ వల్ల తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని హెల్డ్ డైరక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే వారం కూడా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్లో కూడా పర్యటించి కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు.. 18 మరణాలు నమోదైనట్లు చెప్పారు.
సరిహద్దు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లోనూ పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు కావాలని పేర్కొన్నారు. గ్రామాల్లోనూ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీహెచ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.