తెలంగాణ హైకోర్టు కొద్ది రోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపొద్దు అని. అసలు ఎవరు ఇచ్చారు ఆదేశాలు అంబులెన్స్ లను ఆపాలని అంటూ ప్రశ్నించింది. అయితే గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరుతో ఆదేశాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆస్పత్రితో ఒప్పందం చేసుకుని.. బెడ్ ఖాళీగా ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతే రావాలన్నారు. అదే సమయంలో తెలంగాణ సర్కారు పెట్టిన ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకుని కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆ పార్మాట్ లో దరఖాస్తు చేసుకుంటే కంట్రోల్ రూమ్ అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. అయితే శుక్రవారం ఉదయం ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో ఆపేశారు. ఈ సమయంలో ఇద్దరు కరోనా రోగులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో సరిహద్దుల వద్ద ఆగిపోయాయి. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు.
తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా పేషంట్ల బాధితులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సరిహద్దుల్లో ఏపి నుంచి వస్తున్న రోగులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై ఎంపీ సుజనా చౌదరి సన్నిహితుడు గరిమెళ్ల వెంకట కృష్ణారావు తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం సరిహద్దుల్లో రోగులను అడ్డుకున్నప్పుడు, అడ్డుకోవడం అమానుషమని, రాజ్యాంగవ్యతిరేకమని, తక్షణం ఇలాంటి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు అదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ నల్గొండ, మహబూబ్ నగర్ సరిహద్దుల వద్ద ఈరోజు వందలాది అంబులెన్సులను అడ్డుకుని వెనక్కి పంపిన తెలంగాణ పోలీసులపై పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.