
ఎకరాలు...గజాల లెక్కన కెసిఆర్ భూముల అమ్మితే మాట్లాడింది ఎంత మంది?
ప్రభుత్వ భూమి అంటే ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ప్రభుత్వ భూములను ప్రజోపయోగ అవసరాల కోసం వాడుతూ ..భవిష్యత్ అవసరాల కోసం సంరక్షించుకోవాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పారిశ్రామిక వేత్తలకు...బడాబాబులకు కేటాయించుకుంటూ పోయారు..ఇప్పటికి పోతున్నారు కూడా. ఏ పార్టీ అధికారం లో ఉన్నా అదే సాగుతోంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేట భూములను విక్రయించి దళిత బంధు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అప్పటిలో బిఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకున్నారు కూడా. ఒక్క కోకాపేట భూములే కాదు..కెసిఆర్ హయాంలో హెచ్ ఎండీఏ పరిధిలో ఉన్న వందల ఎకరాల భూములను ప్లాట్స్ గా వేసి విక్రయించిన సంగతి అందరూ చూశారు.
బిఆర్ఎస్ పాలన చివరి ఏడాదిలో రియల్ ఎస్టేట్ కంపెనీల యాడ్స్ కంటే సర్కారీ అంటే హెచ్ఎం డీ ఏ భూముల అమ్మకాల ప్రకటనలే పేపర్లలో పెద్ద ఎత్తున కనిపించిన సంగతి తెలిసిందే. ఇదే బిఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ భూముల అమ్మకాలను తప్పుపడుతూ హెచ్ ఎం డీఏ వద్ద ధర్నా చేసింది...అందులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ గతంలో ఎవరూ అమ్మని రీతిలో ప్రభుత్వ భూములను అమ్మేసింది. కాంగ్రెస్ పార్టీ ...ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత బిఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా సాగిన ప్రభుత్వ భూముల అమ్మకాలను తప్పుపట్టారు. ముఖ్యంగా కోకాపేట భూములను అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తన అస్మదీయులకు వీటిని అడ్డగోలుగా కట్టపెట్టింది అని విమర్శించటమే కాకుండా...దీనిపై సిబిఐ కి ఫిర్యాదు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ సంగతి పూర్తిగా మర్చిపోయారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యూ) విగా చెపుతున్న భూముల అమ్మకం వ్యవహారం దుమారం రేపుతోంది. ఇవి హెచ్ సి యూ భూములు కాదు...గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ కు కేటాయించిన భూములు..కోర్టు కేసు క్లియర్ కావటంతో తాము వాటిని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించబోతున్నట్లు మంత్రులు స్ఫష్టంగా చెపుతున్నా కూడా అటు బిఆర్ఎస్...బీజేపీ లతో పాటు మరి కొంత మంది హెచ్ సియూ భూములు అమ్మేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో సాగుతున్న భూముల విక్రయంపై మాట్లాడుతున్న సినీ సెలబ్రిటీ లు కానీ...ఇతర నాయకులు ఎవరూ కూడా కెసిఆర్ హయాంలో సాగిన భూముల వేలంపై మాత్రం నోరు తెరిచిన దాఖలాలు లేవు. ప్రజలు..ప్రజా సంఘాల సంగతి పక్కన పెడదాం. అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఏ అంశంపై మాట్లాడినా కూడా ప్రజలు తమకు అధికారం ఇచ్చారు అని...తమ విధానాల ప్రకారమే ముందుకు వెళతాం తప్ప ...ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్లు తాము చేయం అంటూ కుండ బద్దలు కొట్టినట్లు అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ చెప్పారు. ఇప్పుడు మాత్రం అధికార పార్టీ తాము చెప్పినట్లే చేయాలి...తాము ఏది చెపితే అదే చేయాలి అన్నట్లు వ్యవహరిస్తోంది బిఆర్ఎస్.
హెచ్ సి యూ భూముల విషయంలో సాగుతున్న తంతు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు...అందరికి ప్రజాస్వామ్యం వెంటనే గుర్తుకు వస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించటం తప్పు అని ఎవరూ అనరు. కానీ ఇదే పని బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఎంత మంది చేశారో ప్రతిఒక్కరికి తెలుసు. బిఆర్ఎస్ తన పదేళ్ల హయాంలో ఏమి చేసిందో అందరూ చూశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంతో పాటు చివరకు రైల్వే భూములను కూడా అసెట్ మానిటైజేషన్ పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూసిన పార్టీ నే. కానీ తెలంగాణ లో మాత్రం ఆ పార్టీ నాయకులు మాత్రం భూములు అమ్మకుండా పాలన సాగించాలి అని డిమాండ్ చేస్తోంది.
పార్టీలు అన్ని కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం అలవాటు అయిపొయింది. పోనీ పార్టీలు అందరిది ఇదే విధానం అయినప్పుడు రాబోయే ఎన్నికల్లో తాము ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకు తప్ప...భూములు అమ్మి ప్రభుత్వం నడపం అని చెప్పగలవా?. ప్రభుత్వ భూములు అమ్మకూడదు అన్నదే అన్ని పార్టీ ల విధానం అయినప్పుడు మరి ఈ మాట చెప్పటానికి ఉన్న ఇబ్బంది ఏంటి?. కానీ ఆ పని ఏ పార్టీ చేయదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసే పని ఇదే కాబట్టి. అయితే ప్రతిపక్షాలతో పాటు కొంత మంది ఒక ఎజెండా తో చేస్తున్న ఫేక్ ప్రచారాలను అడ్డుకోవటంలో రేవంత్ రెడ్డి సర్కారు ఘోరంగా విఫలం అవుతోంది అని విమర్శలను మూటకట్టుకుంటోంది. ఐఎంజీ భారత్ భూముల విషయమే కాదు...గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటనల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. హెచ్ సి యూ భూముల విషయంలో ఏకంగా ఏఐ ఆధారిత ఫోటో లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.