రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఆలశ్యంగా వచ్చినా కేసులు మాత్రం స్పీడ్ గా పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజే కొత్తగా రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఈ మొత్తం కేసుల సంఖ్య 20కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురికి సంబంధించి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈ కేసులు అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే కావటం విశేషం.
కేసులు పెరుగుతున్నా ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని నిపుణులు తేల్చటం ఊరట కలిగించే అంశం. అయితే ఈ కేసుల సంఖ్య పెరుగుతూ పోతే వైద్య రంగంపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ బారినపడిన వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. అంతే కాకుండా వీరు అతి త్వరగా కోలుకోవటం కూడా సానుకూల అంశంగా ఉంది. కొత్తగా రాష్ట్రంలో 185 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నూతన సంవత్సర వేడుకలు...తదితర కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అంచనాలు ఉన్నాయి. అయితే ఇది అంతా ప్రజలు పాటించే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది.