బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గత కొంత కాలంగా చెపుతున్న మాట బంగారు తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రం బంగారు తెలంగాణ అయింది అని అయన చాలా సార్లు చెప్పారు. బుధవారం నాడు అయితే ఏకంగా బిఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాత్రం ఏకంగా వజ్రతునక తెలంగాణ అని ప్రకటించారు. ఇది చూసిన వారు అంతా బంగారు తెలంగాణ అయిపోయింది...ఇప్పుడు ఏకంగా వజ్రతునక తెలంగాణ గా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇలా బంగారం...వజ్రాల మధ్య కెసిఆర్ ఒక్క ప్లాటినం తెలంగాణను మాత్రం మిస్ చేశారు అంటూ ఒక ఐఏఎస్ అధికారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల ఏడాదిలో సీఎం కెసిఆర్ నోట ఇంకా ఎన్ని రంగుల, ఎన్ని రకాల తెలంగాణను ఆవిష్కరిస్తారో అనే చర్చ సాగుతోంది. సీఎం కోసం విలాసవంతంగా ఒక ప్రగతి భవన్, సీఎం, మంత్రుల కోసం అడ్డగోలుగా అంచనాలు పెంచి విలాసవంతంగా సచివాలయం, బిఆర్ఎస్ పార్టీ ఆస్తులు మాత్రం 1200 కోట్ల రూపాయలకు పైగా దాటి పోవటంతో తెలంగాణ అంతా బంగారు తెలంగాణ, వజ్ర తునక తెలంగాణ అయిపోతుందా?. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో అమ్మాయిలకు కనీసం టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం.
తమకు సరైన ఆహారం పెట్టాలని విద్యార్థులు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్నీఅమ్ముతూ రాజకీయ అవసరాల కోసం స్కీం లు డిజైన్ చేయటం వజ్ర తునక తెలంగాణనా?. ధరణి తో రైతులను ఆడుకోవటం బంగారు...వజ్రాల తెలంగాణనా?. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సంపాదించి పెట్టే రాజధాని నగరం హైదరాబాద్ లో ఒక పెద్ద వర్షం కురిస్తే మ్యాన్ హోల్ మూతలు లేక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో. ఇవే కాదు...రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సీఎం కెసిఆర్ ఇస్తాంబుల్, లండన్ లా మారుస్తామని ప్రకటించారు. ఇప్పుడు అయన తెలంగాణనే వజ్రపు తునక అన్నారు కాబట్టి ఇక రాష్ట్రం అంతా ఆలా అయిపోయినట్లు బావించాల్సిందేనేమో.